మరోసారి న్యూజిలాండ్‌ ప్రధానిగా జసిండాకే పట్టం

మరోసారి న్యూజిలాండ్‌ ప్రధానిగా జసిండాకే పట్టం

 న్యూజిలాండ్‌ ప్రధానిగా మరోసారి జసిండా ఆర్డెర్న్‌కు.. అక్కడి ప్రజలు పట్టంకట్టారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో... జసిండా నేతృత్వంలోని  సెంటర్‌ లెఫ్ట్‌ లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించింది. కొవిడ్‌ మహమ్మారి కట్టడిలో సమర్థంగా వ్యవహరించిన ఆమెకు అక్కడి ప్రజలు రెండోసారి అధికారం అప్పగించారు.  70 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ప్రధాన ప్రత్యర్థి జుడిత్ కాలిన్స్‌ ఓటమిని అంగీకరించడం విశేషం. మూడింట రెండొంతుల ఓట్లు లెక్కించే సరికే ఆర్డెర్న్‌కు చెందిన లేబర్‌ పార్టీ 49.2 శాతం ఓట్లను సాధించింది. మొత్తం 120 సభ్యులు ఉన్న పార్లమెంట్‌లో లేబర్‌ పార్టీ 64సీట్లు సొంతం చేసుకుంటుందని భావిస్తున్నారు.

న్యూజిలాండ్‌లో 1996లో దామాషా పద్ధతిలో ఓటింగ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత పూర్తి స్థాయి మెజార్టీ.. ఏ పార్టీకీ దక్కలేదు. తాజాగా ఎన్నికల్లో లేబర్‌ పార్టీకి న్యూజిలాండ్‌ ప్రజలు తొలిసారి పూర్తి మెజార్టీని కట్టబెడుతూ సంచలన విజయం అందించారు. సుమారు 77శాతం బ్యాలెట్లను లెక్కించగా.. లేబర్‌ పార్టీకి 49శాతం, నేషనల్‌ పార్టీకి 27శాతం ఓట్లు వచ్చినట్టు వచ్చినట్టు ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. ప్రతిపక్ష నేత జుడిత్‌ కాలిన్స్‌ తన ఓటమిని అంగీకరిస్తూ జసిండాకు ఫోన్‌ చేశారు. గత 50 ఏళ్లలో న్యూజిలాండ్‌ ప్రజలు ఎవరికీ ఇవ్వనంత మద్దతు తమ పార్టీకి అందించారన్నారు జసిండా. ఈ ఎన్నికల్లో నేషనల్‌ పార్టీకి దాదాపు 35 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. గత 20 ఏళ్లలో ఆ పార్టీకి వచ్చిన అత్యంత నిరాశాజనక ఫలితాలివేనని విశ్లేషకులు చెబుతున్నారు.