తెలకపల్లి రవి విశ్లేషణ : ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి నాశనం చేస్తారా?

తెలకపల్లి రవి విశ్లేషణ :  ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి నాశనం చేస్తారా?

తెలకపల్లి రవి:

సిఆర్‌డిఎ  రద్దు, ఆస్థానంలో ఎఎంఆర్‌డిఎ ఏర్పాటు బిల్లులు గవర్నర్‌ ఆమోదం పొందాయి. పాలనా వికేంద్రీకరణ పేరుతో  పాలనా రాజధానిని విశాఖకు  తరలించే మరో బిల్లు కూడా ఆమోదించబడింది. 230 రోజులకు పైబడి అమరావతిలో  సాగుతున్న  నిరసనలపై ఇప్పుడు మరోసారి ఫోకస్‌ పెరిగింది.  పాలక వైసీపీ తప్ప మిగిలిన పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నామని ప్రకటించగా బిజెపి ద్వంద్వంగా మాట్లాడుతున్నది. రాజధాని మార్పునకు ఉద్దేశించిన చట్టాలపై స్టే ఉత్తర్వులివ్వాని ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ మొదులు కావచ్చు. అయితే రాజ్యాంగ రిత్యా శాసన ప్రక్రియ పూర్తయిన ఈ  బిల్లులోని అంశాలు రాజ్యాంగ నిబంధనకు లోబడి వున్నాయా లేదా అన్నది హైకోర్టు విచారించవచ్చునేమో గాని మొత్తంగా నిలిపేస్తుందా లేదా అన్నది సందేహమే, నోటీసులు ఇచ్చి వాయిదా వేసే అవకాశం ఎక్కువగా వుండొచ్చు. తమాషా ఏమంటే బెట్టింగ్‌ క్రీడలకు అలవాటుపడిన  జూదరులు ఇప్పుడు స్టే వస్తుందా లేదా అన్నదానిపైన పందాలు వేసుకున్నారట. ఈ నిర్ణయంపై ప్రజులు చాలా సంతోషంగావున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా సందేహాలు కూడా ఎక్కువగానే వున్నాయి, అమరావతిలో అక్రమాలపై విచారణ జరపొచ్చు గాని భూములిచ్చిన 20 వేల మంది రైతులు, స్థానికంగా చిన్నాభిన్నమైన గ్రామస్థులకు న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌ చర్చ జరిపి చర్యలు తీసుకోవాని అందరూ చెబుతున్న మాట. 
రాజధాని మారకుండా పిఎంఓ జోక్యం చేసుకుంటుందని చెబుతున్న మాట పిట్టకథలేనని నేను ఎన్‌టివి సైట్‌లో మొదట్లో చెప్పిన మాట నిజమైంది.

అప్పుడు ఆ మాటు చెప్పిన వారే ఇప్పుడు బిజెపిని, అంతకు మించి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను విమర్శించడం విచిత్రంగా వుంది. ఈ సమయంలో ఆయన తమ పార్టీలో చర్చలు జరిపి న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. సిపిఐ టిడిపితో కలిసి, సిపిఎం స్వంతంగా నిరసన తెలుపుతున్నాయి, ముందే చెప్పినట్టు బిజెపి ఇప్పటికి పరిపరివిధాలుగా మాట్లాడుతున్నది. ప్రభుత్వం మాత్రం విశాఖకు వేగంగా తరలిపోవడం కోసం ముందు పోలీసు శాఖను రంగంలోకి దింపింది. అన్నీ పరిశీలించేందుకు కమిటీ వేస్తున్నట్టు డిజిపి గౌతం సవాంగ్‌ ప్రకటించారు. మూడు రాజధానుల ప్రాంతాల సమతులాభివృద్ధి కోసమని ప్రభుత్వం చెబుతుంటే ప్రాంతీయ విద్వేషాలు పెంచుతాయని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన సమయంలోనూ తర్వాత కూడా తెలుగు ప్రజలు ప్రదర్శించిన సంయమనం గమనించిన వారెవరూ ఆమాటలు తీవ్రంగా తీసుకోకపోవచ్చు. పైగా అమరావతి హైప్‌ విఫలమైన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందనే దానిపై ప్రజల్లో నిరాసక్తత ఎక్కువగా వుంది. ఈ పరిస్తితుల్లో ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రజల్లో విశ్వాసం పెంచడం  అన్నిప్రాంతాలకూ న్యాయం చేయడం చాలా ముఖ్యం. 


అయితే ఈ సమయంలో వినవచ్చిన విమర్శన్నిటిలోకి విపరీతమైంది ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‌ కోసం అమరావతిని కావాలని నాశనం చేశాడన్న ఆరోపణ, టిడిపి లోకి మారి శాసనసభకు పోటీ చేసిన ఒక మాజీ ఎంపి నుంచి వచ్చిన ఈ ఆరోపణ చాలా అఘాయిత్యంగా వుంది. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ కోసం కెసిఆర్‌  ఇలా కోరితే జగన్‌ అమలు చేశారని చెప్పడం ఆయన అనుభవాన్ని అవగాహనను అపహాస్యం చేసేదిగా వుంది. దేశంలోని మహానగరాల్లో ఒకటైన హైదరాబాద్‌ మార్కెట్‌ యథాతథంగానే వుంది తప్ప చెదిరిపోయింది లేదు. చంద్రబాబు పాలించిన అయిదేళ్లలో అమరావతి అంతగా పరుగు తీసిందీ లేదు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్‌ దాన్ని దెబ్బతీయాలనుకోవడం, మరో  ముఖ్యమంత్రి జగన్‌ అందుకోసం తను పాలించే రాష్ట్రాన్ని నాశనం చేయడానికి సిద్ధం కావడం వూహకందేదేనా? ఇలాంటి తాడూ బొంగరంలేని కథను సీనియర్‌ రాజకీయ నేతలే చెప్పడం  బాధ్యతా రహితం కదా!  ఆ ప్రాతిపదికన  2018,2019 ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తులు శక్తులు చేసిన విష ప్రచారాలు ప్రజలు తిరస్కరించారు కూడా. అయినా గుణపాఠం నేర్చుకోకపోగా మరింత దారుణమైన అపోహలు పెంచే ప్రయత్నం దారుణం, విభజన సమస్యులు ప్రాజెక్టు  వివాదాలు వుండొచ్చు గాని విభజన తర్వాత కూడా తెలంగాణ ఏపీ ప్రజల  మధ్య సుహృద్భావం ఇసుమంతైనా తగ్గింది లేదు.   అలాంటప్పుడు   ఏపిలో  ప్రాంతాల మధ్య  వివాదాలు విద్వేషాలు పెంచే మాట విఫలం కావడం అనివార్యం. కాకుంటే ప్రాంతాల అభివృద్ధికి మార్గం నిధులు ప్రణాళికలకు తప్ప రాజధాని విభజన కాదు. మూడు రాజధానులంటున్నా వాస్తవ పాలనా కేంద్రంగా వుండే రాజధాని విశాఖ ఒక్కటే అవుతుంది. ఆగష్టు 15 నుంచే ఆ సందడీ మొదలవ్వచ్చు . అక్కడ పాలనా రాజధాని శంకుస్తాపన ముఖ్యమంత్రి జగన్‌ చేస్తారని చెప్పిన మంత్రి బొత్ససత్యనారాయణ తర్వాత సవరించుకుని ప్రధాని మోడీనీ ఆహ్వానిస్తామని చెప్పడం మరో విచిత్రం. అయితే గతంలో మట్టి నీళ్లు ఇచ్చి విమర్శలు మూటకట్టుకున్న మోడీ జీ మరోసారి రావడం సుభంకాదు.