బీజేపీలో చేరుతున్న చిరు?

బీజేపీలో చేరుతున్న చిరు?

చిరంజీవి బీజేపీ వైపు చూస్తున్నారా? పార్టీ పెట్టి తాను సాధించలేకపోయిన దాన్ని.. బీజేపీలో చేరి సాధించాలనుకుంటున్నారా?  లేక తమ్ముడు పవన్‌ను వెనకనుండి నడిపించాలని అనుకుంటున్నారా? తాను ఎక్కలేని పీఠాన్ని తమ్ముడైనా అందుకోవాలని ఆశిస్తున్నారా?
 
రాజకీయాలంటే విసిగిపోయిన చిరు కొత్త పాత్ర ఎంచుకున్నారా?

రాజకీయాలకు దూరమైన మెగాస్టార్ ఇప్పుడు టార్గెట్ మార్చుకున్నట్టు కనిపిస్తోంది. కొన్నాళ్లుగా బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్న చిరంజీవి .. రాజకీయ పునఃప్రవేశం చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రాజీకీయాలంటే విసిగిపోయిన చిరు... కొత్త పాత్ర ఎంచుకున్నట్టు కనిపిస్తోంది.  ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసి... కేంద్ర మంత్రి అయ్యి.... ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి ఇప్పుడు కొత్త బాధ్యతను నెత్తిన పెట్టుకోబుతున్నారట. రాజకీయాలు తనకు అచ్చిరాలేదని తెలుసుకున్న అన్నయ్య.... తిరిగి సినిమాల్లో బిజీ అయిపోయారు. అయితే తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పెట్టి రాజకీయాల్లో కొనసాగుతుండటం... ఆయనకు బీజేపీ జత కూడటంతో సరికొత్త టార్గెట్ పెట్టుకున్నారు చిరంజీవి. 
 
2024లో బీజేపీ-జనసేన కూటమి విజయం సాధించాలని ఆశిస్తున్నారా?

2024లో బీజేపీ-జనసేన కూటమి ఏపీలో విజయం సాధించాలని చిరంజవి ఆశిస్తున్నారు. ఇప్పటికే కలిసి పని చేస్తున్న ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల టార్గెట్‌గా పని చేయాలని కోరుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన స్పందర్భంగా మర్యాద పూర్వకంగా చిరంజీవిని కలిశారు సోము వీర్రాజు. ఈ సందర్భంలోనే చిరు తన మనసులోని మాటను బయట పెట్టారు. తమ్ముడు, మీరు కలిసి బాగా పని చేయండి... 2024లోకి అధికారంలో రావాలి... నేను మీకు అండగా ఉంటా..అని చెప్పారట. 
 
పార్టీ పెట్టి ఇబ్బంది పడుతున్న తమ్ముడికి సాయం చేస్తారా?

తమ్ముడు పార్టీ పెట్టినా ఎప్పుడూ దాని గురించి ఒక్క మాట మాట్లాడటం కానీ... సలహాలు, సూచనలు ఇవ్వడం కానీ చేయలేదు చిరంజీవి. పవన్ కల్యాణ్ అంతరంగం పూర్తిగా తెలిసిన అన్నయ్య ఆయన మానానికి ఆయన్ను వదిలేశారు. అయితే ఎంత లేదన్నా... తమ్ముడు తమ్ముడే కదా. వద్దన్నా వినకుండా రాజకీయాల్లోకి వెళ్లి పార్టీ పెట్టి... ఇబ్బంది పడుతున్న పవనకు ఏదో విధంగా సాయం చేయాలని భావిస్తున్నారట. అందుకే సోము వీర్రాజు దగ్గర మనసులో మాట బయటపెట్టేశారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ-జనసేన విడివిడిగా పోటీ చేశాయి. ఈ రెండు పార్టీలు కలిస్తే రాజకీయంగా గట్టి ప్రత్యామ్నయ వేదిక అవుతుందని చిరంజీవి భావిస్తున్నారు. అందుకే తమ్ముడిని వదలకుండా కలిసి పనిచేసి టార్గెట్ ఫినిష్ చేయాలని కమలనాధులను కోరారట చిరు. 

తమ్ముడికి అండగా నిలిచేందుకు మార్గం దొరికిందా?

పార్టీ పెడుతూనే సీఎం కావాలనే టార్గెట్‌తో 2009లో రాజకీయ అరంగేట్రం చేసిన చిరంజీవి ఘోరంగా విఫలమయ్యారు. వైఎస్-చంద్రబాబు మధ్య లేగదూడలా నలిగిపోయారు. 18 సీట్లకే పరిమితం అయ్యారు. తిరుపతిలో గెలిచిన చిరంజీవి పాలకొల్లులో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలతోనే వాస్తవాలు గ్రహించిన ఆయన క్రమంగా ఫేడ్ అవుట్ అయ్యారు. అయితే అనూహ్యంగా పవన్ కల్యాణ్‌ మరోపార్టీ పెట్టి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. చిరంజీవి ఎంత వద్దని వారించినా పవన్ వినిపించుకోలేదట. చేసేది లేక చూస్తూ ఉండిపోయిన మెగాస్టార్‌కు ఇప్పుడు బీజేపీ రూపంలో తమ్ముడికి అండగా నిలిచేందుకు మార్గం దొరికింది.  

ఏపీని గెలవాలంటే చిరంజీవి సహకారాన్ని ఆశిస్తున్న బీజేపీ!

గత ఎన్నికల్లో నాగబాబు తప్ప మెగా ఫ్యామిలీలో పవన్ కల్యాణ్‌కు బహిరంగంగా ఎవరూ మద్దతు ప్రకటించలేదు. కానీ ఈసారి చిరంజీవి కూడా రంగంలోకి దిగవచ్చని అంటున్నారు. బీజేపీ-జనసేన పక్షాన ఆయన ప్రచారం చేసేందుకూ ఆసక్తిగా ఉన్నారట. అటు బీజేపీ కూడా ఏపీని గెలవాలంటే చిరంజీవి వంటి వారి సహకారాన్ని ఆశిస్తోంది. బీజేపీ కూడా మెగా బ్రదర్స్‌పై ఆశలు పెట్టుకుని, వాళ్లనే నమ్ముకున్నట్టుంది. ఇప్పుడు కాకుంటే ఎప్పుడూ ఏపీని గెలవలేమని భావిస్తున్న బీజేపీ.. .సోము వీర్రాజుకు ఆ బాధ్యతలు అప్పగించింది అందుకేనట.  కన్నా కంటే సోము వీర్రాజుతో పవన్ కల్యాణ్, చిరంజీవికి చొరవ ఎక్కువ. ఏ విషయాన్నైన మనసు విప్పి మాట్లాడుకునే వాతావరణం వారి మధ్య ఉందట. 2014 ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్‌ను మోడీ దగ్గరకు తీసుకువెళ్లింది సోము వీర్రాజే. పైకి జనసేన-బీజేపీ కూటమిలా కనిపిస్తున్నా.. చిరంజీవి కూడా ఓ చెయ్యి వేస్తే.. అది బలమైన పక్షం అవుతుందని భావిస్తున్న బీజేపీ... ఆయన సహకారం కోరుకుంటోందట.