ఐపీఎల్ 2020 : ఎట్టకేలకి గెలిచిన చెన్నై.. రాజస్తాన్ రాయల్స్

ఐపీఎల్ 2020 : ఎట్టకేలకి గెలిచిన చెన్నై.. రాజస్తాన్ రాయల్స్

సీఎస్‌కే vs ఆర్సీబీ

ధోనీసేన ఎట్టకేలకు విక్టరీ కొట్టింది. మూడు ఓటముల తర్వాత విజయాన్ని అందుకుంది. కోహ్లీసేనపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇది సీఎస్‌కేకు నాల్గో విజయం కాగా, ఆర్సీబీకి నాల్గో ఓటమి. ఈ మ్యాచ్‌లో కోహ్లి సిక్స్‌ కొట్టడం ద్వారా ఐపీఎల్‌లో 200వ సిక్సర్‌ను సాధించాడు. ఆర్సీబీ నిర్దేశించిన 146 పరుగుల టార్గెట్‌ చేదనకు బరిలో దిగిన CSK జట్టులో డుప్లెసిస్‌ ధాటిగా ఆడాడు.   13 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్స్‌లతో 25 పరుగులు చేసి  ఔటయ్యాడు. ఆ తర్వాత రాయుడు తనదైన శైలిలో ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించాడు.  27 బంతుల్లో 3 ఫోర్లు,  2 సిక్స్‌లతో 39 పరుగులు సాధించిన రాయుడు రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత రుతురాజ్‌-ధోనిలు మరో వికెట్‌ పడకుండా బాధ్యతాయుతంగా ఆడటంతో సీఎస్‌కే 18.4 ఓవర్లలో 150 పరుగులు చేసి విజయం సాధించింది.

ధోని  21 బంతుల్లో 3 ఫోర్లతో అజేయంగా 19 పరుగులు చేశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. 46 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. విరాట్‌ కోహ్లి-ఏబీ డివిలియర్స్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.ఈ జోడి 82 పరుగులు జత చేసింది. డివిలియర్స్‌ 39 రన్స్‌ చేసి అవుటయ్యాడు. ఇక విరాట్‌ కోహ్లి మరోసారి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడాడు.  43 బంతుల్లో 1 ఫోర్‌, 1సిక్స్‌తో  50 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో సిక్స్‌ కొట్టిన కోహ్లి.. ఐపీఎల్‌లో 200వ సిక్సర్‌ను సాధించాడు.  ఐపీఎల్‌లో రెండొందలు, అంతకంటే ఎక్కువ సిక్స్‌లు కొట్టిన జాబితాలో క్రిస్‌ గేల్‌, ఏబీ డివిలియర్స్‌, ధోని, రోహిత్‌ శర్మ తర్వాతి స్థానంలో కోహ్లి నిలిచాడు.

రాజస్థాన్‌ రాయల్స్ vs ముంబై  ఇండియన్స్

రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ బెన్‌ స్టోక్స్‌ అదరగొట్టాడు. సెంచరీతో కదంతొక్కాడు. స్టోక్స్‌ సెంచరీకి తోడు శాంసన్‌ అర్ధసెంచరీతో.. ముంబై పెట్టిన 196 రన్స్‌ టార్గెట్‌ను ఈజీగా ఛేజ్‌ చేసింది రాజస్థాన్‌ రాయల్స్‌. ఇది రాజస్తాన్‌కు ఐదో విజయం కాగా, ముంబైకు నాల్గో ఓటమి. బలమైన ముంబై జట్టుపై అద్భుత విజయం సాధించింది రాజస్తాన్‌ రాయల్స్‌. ముంబై నిర్దేశించిన 196 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్తాన్‌ సునాయాసంగా ఛేదించింది. ఛేజింగ్‌లో ఉతప్ప, స్మిత్‌ త్వరగానే అవుటయ్యారు. ఈ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన శాంసన్‌తో కలిసి స్టోక్స్‌ అదరగొట్టాడు.  బెన్‌ స్టోక్స్‌ 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 107 రన్స్‌ చేశాడు.  సంజూ శాంసన్‌  31 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్స్‌లతో 54 రన్స్ కొట్టాడు. వీరిద్దరూ  చెలరేగిపోవడంతో రాజస్తాన్‌ 18.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది.

ఈ జోడి అజేయంగా 152 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్‌కు మంచి ఆరంభం దక్కలేదు. తొలిఓవర్‌లోనే డికాక్‌ అవుటయ్యాడు. ఆ తర్వాత ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు ఆకట్టుకున్నారు. ఈ జోడి 83 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసింది. ఆ తర్వాత పొలార్డ్‌ నిరాశపరిచాడు. చివరి ఓవర్లలో సౌరవ్‌ తివారీ, హార్దిక్‌ పాండ్య రెచ్చిపోయారు. హార్దిక్‌ పాండ్యా 21 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 60 రన్స్‌ చేశాడు. రాజ్‌పుత్‌ వేసిన 18 ఓవర్‌లో హార్దిక్‌ చెలరేగిపోయాడు. తొలి బంతికి సిక్స్‌ కొట్టిన హార్దిక్‌.. నాలుగు,  ఐదు, ఆరు బంతుల్ని సిక్స్‌లు కొట్టాడు. హార్దిక్‌ హ్యాట్రిక్‌ సిక్స్‌లు సాధించడంతో ఆ ఓవర్‌లో 27 పరుగులు వచ్చాయి. త్యాగి వేసిన చివరి ఓవర్‌లో హార్దిక్‌ మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు కొట్టాడు. చివరి ఐదు ఓవర్లలో ముంబై వికెట్‌ మాత్రమే కోల్పోయి 79 పరుగులు సాధించింది.