బట్లర్ 'మన్కడింగ్‌' అవుట్ చూశారా..?

బట్లర్ 'మన్కడింగ్‌' అవుట్ చూశారా..?

ఐపీఎల్‌ సీజన్-12లో భాగంగా సోమవారం రాజస్థాన్ రాయల్స్‌, కింగ్స్‌ లెవెన్ పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు పంజాబ్‌ విజయం సాధించింది. పంజాబ్‌ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. మొదటగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. విండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్‌ గేల్‌ హాఫ్ సెంచరీ (79; 47 బంతుల్లో 8 ఫోర్లు, 4 ఫోర్లు) చేసాడు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు అంజిక్య రహానే, జోస్ బట్లర్‌లు తొలి వికెట్ కు 78 పరుగులు జోడించారు. రహానే (27) అవుట్ అయినా.. బట్లర్‌ మాత్రం బౌండరీలు బాదుతూ స్కోరును 100 దాటించాడు. 13వ ఓవర్ వేస్తున్న పంజాబ్‌ కెప్టెన్ అశ్విన్.. ఆ ఓవర్‌ చివరి బంతికి బట్లర్‌ను 'మన్కడింగ్‌' ద్వారా ఔట్‌ చేసాడు. అశ్విన్‌ బంతి వేయబోయే సమయానికే బట్లర్‌ క్రీజ్‌ వదిలి ముందుకు వచ్చాడు. ఇది గమనించిన అశ్విన్ తన చేతిని వెనక్కి తీసుకుని బెయిల్స్‌ను పడగొట్టి అప్పీల్‌ చేశాడు. థర్డ్‌ అంపైర్‌ కూడా ఔట్‌గా ప్రకటించాడు. దీంతో అశ్విన్, బట్లర్‌ల మధ్య తీవ్ర వాదోపవాదం జరిగింది. నిజానికి నిబంధనల (రూల్‌ 41.16) ప్రకారమైతే బట్లర్‌ ఔటే. దీనికి సంబందించిన వీడియోను ఐపీఎల్‌ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇంకా ఆలస్యం ఎందుకు మీరూ చూడండి.