ఇందూరు బీజేపీ నాయకుల మధ్య అంతర్గత ఘర్షణలు

ఇందూరు బీజేపీ నాయకుల మధ్య అంతర్గత ఘర్షణలు

అధికార విపక్ష పార్టీల మధ్య విమర్శలు, సవాళ్లు మామూలే. కానీ.. ఇందూరు జిల్లా బీజేపీ నేతలు మాత్రం తాము అందరికంటే భిన్నమని నిరూపించుకుంటున్నారు. ఒకే పార్టీకి చెందిన నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, సవాళ్లు చేసుకుంటున్నారు. సీనియర్లు అనుకున్న వారికే ఒకరి పొడ మరొకరికి గిట్టడం లేదట.

జిల్లా బీజేపీ అధ్యక్షుడు బస్వ వర్సెస్‌ యెండల!

నిజామాబాద్‌ జిల్లా బీజేపీలో కోల్డ్‌వార్‌ తారాస్థాయికి చేరుకుంది. కొత్తగా  జిల్లా అధ్యక్షుడైన బస్వ లక్ష్మీనరసయ్యకు.. పార్టీలోని సీనియర్లకు అస్సలు పడటం లేదట. సీనియర్లు, జూనియర్లు అని రెండు గ్రూపులుగా విడిపోయి డైరెక్ట్‌గానే విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. పార్టీ పరంగా నిర్వహించే కార్యక్రమాలకు జిల్లా అధ్యక్షుడు రావడం లేదని సీనియర్లు గుర్రుగా ఉంటున్నారట. కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి.. తన డ్యూటీ అయినట్లుగా భావిస్తుంటారని బస్వపై పార్టీ నేతలు చేసే ఆరోపణ. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఆయన.. పార్టీలో తనకుంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ వర్గం మండిపడుతోందట.

రాష్ట్ర ఉపాధ్యక్షుడి హోదాలో యెండల జిల్లాకు వస్తే బస్వ రాలేదా?

జిల్లా కమిటీలో యెండల వర్గానికి చోటు కల్పించలేదని.. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నవారిని గుర్తించడం లేదని అంటున్నారట.  పార్టీ సిద్ధాంతాలపై బస్వ అవగాహన తెచ్చుకోవాలని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ సైతం రుసరుసలాడుతున్నారట. పార్టీలో బాధ్యతారహిత్యాన్ని అస్సలు ఉపేక్షించబోమని బస్వను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నట్లు సమాచారం. యెండలకు బీజేపీ రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారు. ఉపాధ్యక్షుడిని చేశారు. అలా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడి హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చినా .. జిల్లా అధ్యక్షుడు బస్వ అందుబాటులో లేకపోవడంతో యెండల మండిపడుతున్నారట.

టీఆర్‌ఎస్‌కు అమ్ముడు పోయారంటూ యెండలపై మరో వర్గం ఆరోపణ!

ఏప్రిల్‌లో నిర్వహించిన పార్టీ జెండా ఆవిష్కరణకు సైతం జిల్లా అధ్యక్షుడు రాలేదని.. ఇలా అయితే నాయకత్వ లక్షాణాలు వచ్చేవరకూ ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామని సీనియర్లు సైతం పదే పదే వ్యాఖ్యానిస్తున్నారట.  దీంతో బీజేపీలో నేతల మధ్య కోల్డ్‌వార్‌ తారాస్థాయికి చేరుకుందని కమలదళం భావిస్తోంది. యెండలకు స్వాగతం చెప్పే కార్యక్రమానికి మరోవర్గం దూరంగా ఉందట. అసలు యెండలకు పదవి రావడం ఆ వర్గానికి ఇష్టం లేదన్న టాక్‌ ఉంది. పైగా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఆయన అమ్ముడు పోయారని ఆరోపణలు చేస్తోందట. బీజేపీ కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌లో చేరడానికి కూడా యెండలే కారణమని ఆ వర్గం చేస్తున్న ప్రధాన ఆరోపణ.

రెండు వర్గాల పోరుతో గందరగోళంలో కేడర్‌!

కలిసికట్టుగా అధికార పక్షాన్ని ఎదుర్కోవాల్సిన సమయంలో ఇలా  రెండు వర్గాలుగా పార్టీ నేతలు విడిపోవడం కేడర్‌ను గందరగోళ పరుస్తోందట. మరికొందరైతే ఈ రెండు వర్గాలకు దూరంగా ఉండిపోయినట్లు సమాచారం. మరి.. పార్టీ పెద్దలు రెండు వర్గాల మధ్య సయోధ్య కుదురుస్తారో లేదో చూడాలి.