పింక్‌ బాల్ టెస్ట్.. టీమిండియా గ్రాండ్ విక్టరీ

పింక్‌ బాల్ టెస్ట్.. టీమిండియా గ్రాండ్ విక్టరీ

ఇంగ్లండ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా.. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది భారత్.. దీంతో.. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో అధిక్యంలో ఉంది.. మొతేరా స్టేడియంలో భారత బౌలర్లు మోత మోగించారు.. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లండ్ ఘోర పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. కేవలం రెండు రోజుల్లో టెస్ట్ మ్యాచ్ ముగియగా.. ఆది నుంచి టీమిండియా ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వచ్చింది.. ఒక పక్క ఐదు వికెట్లు తీసిన అక్షర్ పటేల్.. ఇంగ్లండ్‌పై ఒత్తిడి తెస్తే.. మరోవైపు 4 వికెట్లతో అశ్విన్ రాణించాడు.. దీంతో రెండ్సో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే పెవిలియన్ చేరింది.. ఇక, తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు కుప్పకూలింది ఆ జట్టు.. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత భారత్ ముందు 49 పరుగుల టార్గెట్ ఉంది.. కానీ, భారత్ ఒక్క వికెట్ కూడా  కోల్పోకుండా కేవలం 7.4 ఓవర్లలో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్ ఆడుతూ పాడుతూ.. భారత్‌కు విజయాన్ని అందించారు.. 25 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో రోహిత్ 25 పరుగులు చేస్తే.. 21 బంతుల్లో ఒక ఫోర్‌, మరో సిక్స్‌ తో 15 పరుగులు చేశాడు శుభ్‌మన్‌ గిల్.. మొత్తంగా ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది భారత్.