భారత్‌ చేతికి స్విస్ బ్యాంక్ ఖాతాదారుల రెండో జాబితా..

భారత్‌ చేతికి స్విస్ బ్యాంక్ ఖాతాదారుల రెండో జాబితా..

భారత్‌, స్విట్జర్లాండ్ ప్రభుత్వాల మధ్య కుదిరిన బ్లాక్‌మనీ ఆటోమేటిక్‌ ఎక్సేంజ్‌ ఒప్పందం ప్రకారం.. స్విస్‌ బ్యాంకు అకౌంట్లు ఉన్న రెండో భారతీయుల జాబితా విడుదలైంది. భారత్‌తో పాటు మొత్తం 86 దేశాలతో ఈ ఒప్పందం ఉంది. అందులో భాగంగా.. 86 దేశాలకు చెందిన 31 లక్షల అకౌంట్ల వివరాలను స్విట్జర్లాండ్‌.. ఆయా దేశాలకు ఇచ్చింది. గత ఏడాది సెప్టెంబరులో స్విట్జర్లాండ్.. భారత్‌తో సహా 75 దేశాలకు స్విస్‌ అకౌంట్లు ఉన్న వారి జాబితాను అందజేసింది. ఇప్పుడు రెండో జాబితా విడుదల చేసింది. 

ఈ లిస్టులో అకౌంట్లు ఉన్న వ్యక్తులు, సంస్థల సమాచారం ఉంటుందని స్విస్‌ వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పుడు విడుదల చేసిన జాబితాలో భారత్‌కు చెందిన ఎన్ని సంస్థలు, ఎంతమంది వ్యక్తుల వివరాలు ఉన్నది తెలియరాలేదు. అయితే ఇందులో భారత్‌కు చెందిన అనేక మంది వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో నల్లధనం దాచిన వారి వివరాలు, పనామా, బ్రిటిష్ వర్జిన్‌ ఐలాండ్స్‌ లాంటి చోట్ల నకిలీ సంస్థలు ఏర్పాటు చేసిన వారి వివరాల్ని భారత్‌.., స్విస్‌కు ఇచ్చింది. ఇప్పుడు స్విట్జర్లాండ్‌ ఇచ్చిన నివేదికలో ఆయా సంస్థల వివరాలు ఎన్ని ఉన్నాయన్నది ఇంకా స్పష్టంకాలేదు. అయితే స్విస్‌ ఇచ్చిన అకౌంట్ల వివరాలతో.. ఆ అకౌంట్లు కలిగిన వ్యక్తులు సరిగా పన్నులు కట్టారా ? లేక అక్రమంగా నిధుల్ని మళ్లించారా ? అనే అంశంపై తేల్చే అవకాశం ఉంటుంది. మళ్లీ స్విట్జర్లాండ్‌ వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో మూడో జాబితా విడుదల చేయనుంది.