త్వరలో రూ .20 నాణెం

త్వరలో రూ .20 నాణెం

భారత దేశ కరెన్సీ మార్కెట్‌లోకి మరో కొత్త నాణెం అతి త్వరలో రాబోతోంది. ఆర్థికశాఖ త్వరలో రూ. 20 నాణేన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేసింది. అయితే నాణెంను ఎప్పుడు విడుదల చేస్తారనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.

రూ. 20 నాణేన్ని సరికొత్తగా తీసుకొస్తున్నట్లు ఆర్థికశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. రూ. 20 నాణెంకు 12 అంచులు ఉంటాయని తెలిపింది. నాణెం బరువు  8.54 గ్రామ్స్ ఉంటుంది. ఇది మార్కెట్‌లో ఉన్న అన్ని నాణెల కంటే బరువైంది. ఈ నాణెంపై చివర్లలో ఎలాంటి డిజైన్‌ ఉండదట. రూ. 10 నాణెంలాగే.. రూ. 20 నాణెంలోనూ రెండు రింగ్స్‌ ఉంటాయి. వెలుపలి రింగ్‌ను 65శాతం రాగి, 15శాతం జింక్‌, 20శాతం నికెల్‌తో తయారుచేస్తుండగా.. లోపలి రింగ్‌ను 75శాతం కాపర్‌, 20శాతం జింక్‌, 5శాతం నికెల్‌తో రూపొందిస్తున్నారు. నాణెం ఎడమ అంచున 'భారత్' అని హిందీలో, కుడి అంచున 'ఇండియా' అని ఇంగ్లీష్ లో ఉంటాయి. అశోక చిహ్నం, సత్యమేవ జయతే కూడా నాణెంపై ఉంటాయి.