సైన్యం చేతిలో ఇమ్రాన్ ఖాన్ 'తోలు బొమ్మ'

సైన్యం చేతిలో ఇమ్రాన్ ఖాన్ 'తోలు బొమ్మ'

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తన మాజీ భార్య రేహాం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్మీ చేతిలో ఆయన తోలు బొమ్మ అని, పుల్వామా దాడిపై స్పందించడానికి ఆర్మీ అనుమతి ఇచ్చిన తరువాతే ఇమ్రాన్ ఖాన్ స్పందించారని ఆరోపించింది. ఇమ్రాన్ ఖాన్ తన భావజాలాన్ని, దేశంలో నెలకొన్న పరిస్థితులను పక్కకు పెట్టారని తెలిపింది. ఆర్మీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారని అభిప్రాయపడింది. ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఏం మాట్లాడాలన్నా మిలటరీ అధికారుల వైపు చూస్తారని చెప్పారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పుల్వామా దాడిపై స్పందించిన తరువాత రేహాం ఖాన్ మాట్లాడారు. భారత్ యుద్దం ప్రకటించినట్లైతే పాకిస్థాన్ ఖచ్చితంగా ఎదుర్కొంటామన్న ఇమ్రాన్ వ్యాఖ్యలకు గానూ.. మొదట దాడికి పాల్పడిన వారిని గుర్తించి ఆ దేశానికి అప్పగించాలని కోరింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై మాజీ భార్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

పుల్వామా దాడి ఘటన తర్వాత పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎట్టకేలకు మంగళవారం నోరు విప్పిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడితో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడులకు పాకిస్థాన్‌తో సంబంధం ఉందని భారత్ రుజువులు చూపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అలా కాదని తమపై దాడికి దిగితే ధీటైన సమాధానం చెబుతామని హెచ్చరించారు.