ఐడియా రూ.392 ప్రీపెయిడ్ రీచార్జి ప్యాక్

ఐడియా రూ.392 ప్రీపెయిడ్ రీచార్జి ప్యాక్

టెలికామ్ రంగంలో ధరలు, డేటా వార్ చరమసీమకు చేరుకున్నాయి. ఇప్పుడు ఒక ఆపరేటర్ ప్లాన్ లో మార్పులు చేస్తే మిగతావాళ్లు కూడా అదే బాట పడుతున్నారు. ఇటీవల వొడాఫోన్ తన రెండు ప్రీపెయిడ్ ప్లాన్లలో మార్పుచేర్పులు చేసి కొత్తగా మరొకటి ప్రవేశపెట్టింది. వెంటనే ఎయిర్ టెల్ కూడా అదే దారిలో నడిచింది. ఇటీవలే వొడాఫోన్ లో విలీనమై వొడాఫోన్ ఐడియాగా మారిన ఐడియా సెల్యులార్ కూడా ఇప్పుడు సరికొత్త ప్లాన్లతో ముందుకొచ్చింది. 

ఐడియా సెల్యులార్ రూ.392తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ లో 60 రోజుల వాలిడిటీ ఉంటుంది. రోజుకి 1.4జీబీ 3జీ/4జీ డేటా అందిస్తోంది. అంటే యూజర్లు 60 రోజుల కాలపరిమితి ముగిసేలోగా మొత్తం 84జీబీ డేటాను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లో అపరిమిత కాల్స్, రోజుకు 100 లోకల్, నేషనల్ ఎస్ఎంఎస్ లు పంపే వెసులుబాటు ఉంది. రూ.392 ప్రీపెయిడ్ ప్లాన్ తో పాటుగా ఐడియా సెల్యులార్ తన రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ లో మార్పులు చేసింది. ఇప్పుడు ఈ ప్లాన్ లో 84 రోజుల కాల పరిమితి ఇచ్చారు. రోజుకి 1జీబీ డేటా, అపరిమిత కాల్స్ అందిస్తున్నారు. ఇంతకు ముందు ఈ ప్లాన్ లో రోజుకి 1.4జీబీ డేటా 70 రోజుల కాలపరిమితికే ఉండేది. ఐడియా సెల్యులార్ ఇప్పుడు ఈ కాల పరిమితిని 14 రోజులు పొడిగించి రోజువారీ డేటా వినియోగంలో 400ఎంబీ కోత పెట్టింది.

కొత్త ప్లాన్ లో అపరిమిత కాలింగ్ లో ఒక మెలిక పెట్టారు. ఎయిర్ టెల్, రిలయన్స్ జియో అపరిమిత కాలింగ్ ఎలాంటి షరతులు లేకుండా అందిస్తుండగా ఐడియా సెల్యులార్ కొన్ని పరిమితులు విధించింది. రోజువారీ కాలింగ్ 250 నిమిషాలకే పరిమితం చేశారు. వారానికి కాల్స్ పరిమితిని 1,000 నిమిషాలు మాత్రమే ఇచ్చారు. యూజర్లు 100 వేర్వేరు నెంబర్లకు వాయిస్ కాల్స్ మాత్రమే చేయాలి. రోజువారీ పరిమితి దాటితే ఔట్ గోయింగ్ కాల్స్ పై నిమిషానికి 30 పైసలు వసూలు చేస్తారు. 

కొత్త రూ.399 ప్లాన్లతో వొడాఫోన్, ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్ ఒకే తరహా ప్రయోజనాలు, కాలపరిమితి, రోజువారీ డేటా అందిస్తున్నట్టయింది. కాకపోతే ఎయిర్ టెల్ బేషరతుగా అపరిమిత కాలింగ్ అందిస్తుండగా వొడాఫోన్ ఐడియా కొన్ని పరిమితులు విధించాయి.