వైసీపీ చర్యలతో బెంబేలెత్తిపోతున్న టీడీపీ ఎమ్మెల్యే...?

వైసీపీ చర్యలతో బెంబేలెత్తిపోతున్న టీడీపీ ఎమ్మెల్యే...?

శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం నియోజకవర్గం ప్రత్యేకత వేరు. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత ఒకసారి తప్ప ప్రతీసారీ తెలుగుదేశానిదే గెలుపు. మొన్న ఎన్నికల్లో సైతం వైసీపీ గాలిని కూడా తట్టుకుని ఇచ్ఛాపురంలో డాక్టర్‌ బెందాళం అశోక్‌ రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. జనం సైకిల్‌కు ఓటేసినా.. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండటంతో స్థానిక ఎమ్మెల్యేను అధికార పార్టీ నేతలు ఓ రేంజ్‌లో ఇబ్బంది పెడుతున్నారట. గెలవలేకపోయామన్న బాధను పక్కన పెట్టేసిన వైసీపీ నేతలు.. తమ చేతలతో బెందాళం అశోక్‌ను బెంబేలెత్తిస్తున్నట్లు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. ముఖ్యంగా నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న పిరియా సాయిరాజ్‌ అండ్‌ ఫ్యామిలీ మాత్రం ఎమ్మెల్యేను బయట అడుగుపెట్టనివ్వకుండా అడుగడుగునా చెక్‌ పెడుతోందట.

అధికారిక, అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేగా అశోక్‌ను ప్రోటోకాల్‌ ప్రకారం పిలవాల్సి ఉన్నా.. ఇచ్ఛాపురంలో మాత్రం అంతా రివర్స్‌లో ఉంటోందట. అధికారికంగా నిర్వహించే ఏ కార్యక్రమంలోనూ అశోక్‌ను అడుగుపెట్టనివ్వడం లేదట ఫ్యాన్‌ పార్టీ నేతలు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే రాకమునుపే వైసీపీ నేతలు వాలిపోయి వాటిని కానిచ్చేస్తున్నారు. ఇదంతా చూసిన ఎమ్మెల్యే పలుమార్లు వెనుదిరిగి వెళ్లిపోయారు. వైసీపీ నేతల తీరుకు నిరసనగా ప్రొటోకాల్ పాటించడం లేదని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఎమ్మెల్యే గంటల తరబడి నిరసన తెలిపారు. 6 నెలల కిందట పలాసపురంలో అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యేపై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించడం అప్పట్లో కలకలం రేపింది. ఆ సమయంలో అశోక్‌కు అండగా ఉన్నామంటూ పార్టీ ముఖ్యనేతలు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులు ఇతర జిల్లా నాయకులు సంఘీభావం తెలిపారు. కలెక్టర్‌పై కంప్లయింట్‌ కూడా చేశారు. అయితే ఇవేమీ ఫలితానివ్వలేదు.  ఎమ్మెల్యేని ఎక్కడా అడుగుపెట్టనివ్వలేదు. ఆయన మాట కూడా నెగ్గనివ్వడం లేదు.