టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేసిన ఐసీసీ...

టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేసిన ఐసీసీ...

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక స్థానం మెరుగుపరచుకొని 697 పాయింట్లతో ఆరోస్థానానికి చేరాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టీ20ల్లో రాణించిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ డెవోన్ కాన్వే, మార్టిన్ గప్టిల్ ఈ తాజా ర్యాంకింగ్స్‌లో మెరుగైన ర్యాంకులు సాధించారు. తొలి టీ20లో 99 పరుగులు చేసిన కాన్వే ఏకంగా 46 స్థానాలు ఎగబాకి 17వ స్థానంలో నిలవగా.. రెండో టీ20లో 97 పరుగులు చేసిన గప్టిల్ మూడు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకు సాధించాడు.

ఇంగ్లండ్ ప్లేయర్ డేవిడ్ మలాన్(915) అగ్రస్థానంలో ఉండగా.. బాబర్ ఆజమ్(పాకిస్థాన్), ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా) రాహుల్ తర్వాత ఉన్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రషీద్ ఖాన్ అగ్రస్థానంలో ఉండగా.. భారత్ నుంచి ఒక్కరు కూడా టాప్-10లో లేరు. ఆల్‌రౌండర్ల జాబితాలో మహ్మద్ నబీ టాప్‌లో కొనసాగుతున్నాడు. గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడిన భారత్ మళ్లీ పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌ల్లో పాల్గొనలేదు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ అనంతరం టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది.