సౌత్ ఆఫ్రికా వేదికగా 2023 టీ20 ప్రపంచ కప్...

సౌత్ ఆఫ్రికా వేదికగా 2023 టీ20 ప్రపంచ కప్...

మహిళల టీ20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 2023 లో దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతుందని ఐసీసీ తాజాగా ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా న్యూజిలాండ్‌లో జరగాల్సిన వన్డే వరల్డ్ కప్ ను ఐసీసీ 2021 నుండి 2022 వరకు వాయిదా వేసింది. అలాగే మహిళల టీ20 క్రికెట్ కూడా 2022 బర్మింగ్‌ హామ్ లో జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో భాగం చేసినట్లు కూడా ఐసీసీ ఈ మధ్యే ప్రకటించింది. "ఐసీసీ ఉమెన్స్ టీ 20 ప్రపంచ కప్ 2022 లో కాకుండా 2023 ఫిబ్రవరి 9-26 వరకు జరుగుతుంది" అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే కామన్వెల్త్ క్రీడల్లో మహిళల టీ20 క్రికెట్ ను భాగం చేయడమే ఈ వాయిదాకు కారణమని తెలుస్తుంది. అలాగే క్రీడాకారుల పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. ఇక చివరి మహిళల టీ 20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 2020 లో ఆస్ట్రేలియాలో జరిగింది. అక్కడ ఆతిథ్య జట్టు ఫైనల్ లో భారత్ ను ఓడించి ఐదవసారి టైటిల్ అందుకుంది.