40% ఎక్కువ ధరకు రాఫెల్ జెట్ల కొనుగోలు

40% ఎక్కువ ధరకు రాఫెల్ జెట్ల కొనుగోలు

భారత ప్రభుత్వం, ఫ్రాన్స్ కంపెనీ దసాల్ట్ మధ్య జరిగిన రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో కొత్త కోణం వెలుగు చూసింది. పాత డీల్ తో పోలిస్తే దాదాపు 40% ఎక్కువ ఖరీదుకి కొనుగోలు చేయడం జరిగింది. 2016లో 36 ఫైటర్ జెట్లను గ్లోబల్ టెండర్లు పిలిచి భారత సర్కార్ కొనుగోలు చేసింది. ఫ్రాన్స్ కంపెనీ దసాల్ట్ 2012లో భారత ప్రభుత్వానికి 126 మీడియం మల్టీ-రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎంఎంఆర్సీఏ)లను 40% తక్కువకు అమ్మేందుకు ఆఫర్ ఇచ్చింది. ఈ వ్యవహారం రక్షణ మంత్రిత్వశాఖలోని ఇద్దరు సీనియర్ అధికారుల ఫైళ్లలో స్పష్టంగా ఉంది. వీరిద్దరూ 2012 నుంచి దసాల్ట్ విమానాల కొనుగోలు ఒప్పందంలో కీలక పాత్ర పోషించారు. వీళ్లు దసాల్ట్ తో విమానాల కొనుగోలుపై బేరసారాలు జరిపారు. 

వాళ్లిద్దరూ ఇప్పటికీ రక్షణ మంత్రిత్వశాఖలో పని చేస్తున్నారు. వీళ్లిద్దరూ తమ ఫైళ్లలో పేర్కొన్న కొన్ని అంశాల ఆధారంగా బిజినెస్ స్టాండర్డ్ ఒక వార్తాకథనం ప్రచురించింది. ఇందులో దసాల్ట్ ద్వారా ఆఫర్ చేసిన పాత ధరలతో పోలిస్తే భారత ప్రభుత్వం కొత్త ఒప్పందంలో దాదాపు 40% ఎక్కువ ధరకు విమానాలు కొనుగోలు చేయనుంది. ఫ్రాన్స్ కంపెనీ 126 ఎయిర్ క్రాఫ్ట్ ల ధర సుమారు 19.5 బిలియన్ యూరోలుగా పేర్కొంది. దీని ప్రకారం దసాల్ట్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ ధరను సగటున 155 మిలియన్లుగా తెలిపింది. ఇందులో విమానాల ధర, టెక్నాలజీ బదిలీ, దాని దేశీకరణ చేయడం, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మలచడం, అమర్చాల్సిన ఆయుధాలు, విడిభాగాలు, మెయింటెనెన్స్ గ్యారంటీ కూడా ఉన్నాయి.

దసాల్ట్ 30 జనవరి, 2012న రాఫెల్ విమానాల ఒప్పందానికి ఆఫర్ ఇచ్చింది. దీని ప్రకారం 126 విమానాల ఖరీదు రూ. 1,27,000 కోట్లు. అంటే ఒక రాఫెల్ యుద్ధవిమానం ధర దాదాపు రూ.1,000 కోట్లు మాత్రమే. అప్పటి ఎక్స్ఛేంజి రేటు ప్రకారం యూరో విలువ రూ.65.14గా ఉంది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం 2016లో దసాల్ట్ తో కొత్త ఒప్పందం కుదుర్చుకొంది. దీని ప్రకారం 36 విమానాలను భారత్ కొనుగోలు చేస్తుంది. ఇందుకు 7.8 బిలియన్ యూరోలు చెల్లించాలి. కొత్త ఒప్పందం ప్రకారం ప్రతి విమానం ధర సగటున 217 మిలియన్ యూరోలు అవుతుంది. పాత ఒప్పందంతో పోలిస్తే సుమారుగా 40% ఎక్కువ.

కొత్త వివరాల ప్రకారం చూస్తే ఏ ఆధారంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, వాయుసేనలోని కొందరు ఉన్నతాధికారులు 2016లో తాము కుదుర్చుకొన్న రాఫెల్ విమానాల ఒప్పందం మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని డీల్ కంటే 9-20% తక్కువని చెప్పడం ఆశ్చర్య పరుస్తోంది. కొత్తగా 36 రాఫెల్ విమానాల కొనుగోలు కోసం కుదుర్చుకొన్న 7.8 బిలియన్ యూరోల ఒప్పందంలో విడిభాగాలు, ఆయుధాలు, విమాన భాగాలకు గ్యారంటీ వంటివి కూడా ఉన్నాయని చెబుతున్నారు. కానీ అవి పాత ఒప్పందంలోనూ ఉండటం గమనార్హం.