మరోసారి భారీ వర్షం : హైదరాబాద్‌ అతలాకుతలం

మరోసారి భారీ వర్షం : హైదరాబాద్‌ అతలాకుతలం

హైదరాబాద్‌ను మరోసారి భారీ వర్షం అతలాకుతలం చేసింది. సిటీలోని అన్ని ప్రాంతాల్లో కుండపోత కురిసింది. దీంతో రహదారులపై భారీగా వరదనీరు నిలిచిపోయింది. మోకాల్లోతు నీళ్లలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎల్బీనగర్‌ దగ్గర జాతీయ రహదారి డివైడర్‌ పైనుంచి వరదనీరు పొంగిపొర్లడంతో.. రెండు కిలోమీటర్లు వాహనాలు నిలిచిపోయాయి.  పనామా - ఎల్బీనగర్‌ రహదారి గోదావరిని తలపించింది. ఈ ఏరియాలో ఒక గంటలోనే 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు మెహదీపట్నం, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి రహదారిపై ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోయింది. 

గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, లంగర్‌హౌజ్‌, మెహదీపట్నం మీదుగా వాహనాలను దారి మళ్లించారు. అలాగే పాతబస్తీలోని బాబానగర్‌లో భారీగా వరద పోటెత్తింది. బాలాపూర్‌ చెరువు నీళ్లు వీధుల్లోకి వచ్చేశాయి. ముసారాంబాగ్‌ వంతెనపై రాకపోకలు నిలిపేశారు పోలీసులు. గోల్నాక వంతెనపై నుంచి వాహనాల దారిమళ్లింపుతో  అక్కడ రద్దీ తీవ్రంగా పెరిగింది. ఉప్పల్‌లో వరంగల్‌ జాతీయ రహదారిపై వరద కారణంగా వాహనాలు ఎక్కడికక్క ఆగిపోయాయి. పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే మీదుగా బెంగళూరు, విమానాశ్రయం వైపు  వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్ , బోయిన్‌పల్లి, కుత్‌బుల్లాపూర్‌, జీడిమెట్ల.. ఇలా జంటనగరాల వ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. 

మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు హెచ్చరించారు. నగర శివారులోని హిమాయత్ సాగర్ జలాశయానికి వరద వస్తోందని.. వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువన మూసీ నదిలోకి విడుదల చేస్తున్నామని తెలిపారు. నీటి విడుదలతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో నగరవాసులెవరూ ఇంటినుంచి బయటకురాకపోవడమే మంచిది. వరుస వర్షాలతో ఇప్పటికే రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది.

మరోసారి వర్షం కురియడంతో ఎక్కడ ఏ మ్యాన్‌ హోల్‌ ఉందో.. తెలియని పరిస్థితి. దీంతో అత్యవసరమైతే గానీ,ఇంటినుంచి బయటకు రాకపోవడం మేలు. చిన్నపిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిస్థితుల్లో విద్యుత్ స్తంభాలు, వైర్లను తాకడం ప్రమాదకరం. లోతట్టు ప్రాంతాల  ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది.  భారీ వర్షాలతో హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు దుర్గం చెరువు హ్యాంగింగ్‌ బ్రిడ్జ్‌పై... వీకెండ్‌లోనూ వాహనాలు రాకపోకలకు  అనుమతిచ్చారు పోలీసులు. దీంతో ట్రాఫిక్‌ ముందుకు కదిలేందుకు అవకాశం ఏర్పడింది. 

బంగాళఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడన ద్రోణులతో తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్ మొత్తం మీద వానలు దంచికొట్టాయ్. ఒకదానివెనుక ఒకటిగా ఏర్పడుతున్న అల్పపీడన ద్రోణులతో ఇప్పటికే రెండురాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కుంభవృష్టి వర్షాలకు జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి.  ఈ సీజన్‌లో ఇప్పటికే పది అల్పపీడన ద్రోణులు ఏర్పడగా.. ఈరోజు ఏర్పడిన వాయుగుండం.. పదకొండవది.  

ఆగస్టులో 5 అల్పపీడన ద్రోణులు ఏర్పడగా, సెప్టెంబర్, అక్టోబర్‌లో రెండు చొప్పున అల్పపీడనాలు ఏర్పడ్డాయి. జూన్, జూలైలో ఒక్కో అల్పపీడనాలు ఏర్పడ్డాయి. కాగా, హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి ,నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి, నల్గొండ, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో వానలు దంచి కొట్టాయి. కొన్ని చోట్ల చెట్లు కూలడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. అలాగే రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని...  అంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.