వరదల దెబ్బకు GHMC ఎన్నికల షెడ్యూల్ మార్చుతారా

వరదల దెబ్బకు GHMC ఎన్నికల షెడ్యూల్ మార్చుతారా

GHMC ఎన్నికలపై వరదల ప్రభావం పడిందా? 3 నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లాలని అనుకున్న టీఆర్‌ఎస్‌.. పునరాలోచన చేస్తోందా? మారిన పరిస్థితుల్లో ఇప్పుడు షెడ్యూల్‌ ప్రకారమే గ్రేటర్‌ పురపోరు ఉంటుందా? 

జీహెచ్‌ఎంసీ ముందస్తు ఎన్నికలు కష్టమేనా? 

GHMC ఎన్నికల విషయంలో అనుకున్నదొక్కటీ.. అయ్యిందొక్కటా? అధికార పార్టీలో.. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. ప్రస్తుత కౌన్సిల్‌ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగుస్తుంది.  GHMC చట్టం ప్రకారం పదవీకాలం ముగిసే సమయానికి 3 నెలల ముందుగానే  ఎన్నికలు జరుపుకొనే వెసులుబాటు ఉంది. ఆ మేరకు నవంబర్‌, డిసెంబర్‌లో ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్‌ వేసుకుంది. అయితే అంతా తలకిందులైందనే చర్చ జోరందుకుంది. 

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేల నిలదీత!

అకాల వర్షాలు, వరదలతో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నట్టు అనుమానిస్తున్నారట. వరద ప్రభావిత ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పర్యటిస్తుంటే జనాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖం మీదే కడిగేస్తున్నారు.  నిరసనలకు దిగుతున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ప్రభుత్వ యంత్రంగంపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. సహాయ చర్యల విషయంలో GHMCతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలు విఫలమయ్యాయని జనం ఫైర్‌ అవుతున్నారు. 

అధికార పార్టీ మనసు మార్చుకుంటుందా? 

అక్కడా ఇక్కడా అని లేదు. హైదరాబాద్‌ నలుమూలలా ఇదే పరిస్థితి ఉండటంతో అధికార పార్టీ మనసు మార్చుకుందనే చర్చ జరుగుతోంది. గతంలో అనుకున్నట్టు ముందస్తు గ్రేటర్‌ ఎన్నికలకు వెళ్లపోవచ్చునని భావిస్తున్నారు. ఆ మధ్య ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. షెడ్యూల్‌ ప్రకారం కాకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టుగా  సమావేశానికి హాజరైన వారు అభిప్రాయపడినట్టు సమాచారం. 

వరదల తర్వాత ఎన్నికలపై పునరాలోచన?

ముందస్తు ఎన్నికలకు తగ్గట్టుగానే గ్రేటర్‌లో పరిస్థితులపై టీఆర్‌ఎస్‌ ఆరా తీసింది. సిట్టింగ్‌ కార్పొరేటర్ల పనితీరుతోపాటు ఆయా డివిజన్లలో ఉన్న రాజకీయ పరిస్థితులను, పరిష్కరించాల్సిన సమస్యలను, కొత్తగా ఇవ్వాల్సిన హామీలపై సమాచారం కోసం 18 మంది ఇంఛార్జ్‌లను నియమించింది అధికార పార్టీ.  క్షేత్రస్థాయి పరిస్థితులపై ఓ నివేదిక కూడా అందింది. మరో రెండు సర్వేలకు సిద్ధమవుతోంది. ప్రారంభోత్సవాల స్పీడ్‌ పెరిగింది. మరి.. ఇప్పుడేం జరుగుతుంది? అన్నదే మిలియ్‌ డాలర్ల ప్రశ్నగా ఉంది. 

సిటీలో జనం కోలుకున్న తర్వాతే ఎన్నికలు?

వరదల తర్వాత గ్రేటర్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడంపై టీఆర్‌ఎస్‌ పునరాలోచన చేసే అవకాశం లేకపోలేదు అని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయట.  కాదూ కూడదని ఎన్నికలకు వెళ్తే రాజకీయంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని.. సిటీలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే పురపోరుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వొచ్చని ప్రచారం మొదలైంది. వరదల నుంచి జనం తేరుకున్నాక మరోసారి గ్రేటర్‌లో రాజకీయ పరిస్థితులపై అంతర్గత సర్వేలకు వెళ్లే ఛాన్స్‌ ఉందని చెబుతున్నారు. అప్పుడే GHMC ఎన్నికలు ఉండొచ్చని భావిస్తున్నారు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.