భార్యకు గుండు గీయించిన భర్త

 భార్యకు గుండు గీయించిన భర్త

భార్యపై అనుమానంతో గ్రామస్తులందరి ముందు ఆమెను దారుణంగా అవమానించాడు. నాగరిక సమాజంలో కూడా అనాగరిక చర్యకు పాల్పడ్డాడు. ఈ అమానవీయ చర్య ప్రకాశం జిల్లా చీమకుర్తిలో చోటుచేసుకుంది. మంచికలపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, భాగ్యలక్ష్మి ఎనిమిదేళ్ల కిత్రం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.  పెళ్లైన ఎనిమిదేళ్ల తర్వాత కూడా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. ఇందుకు శ్రీనివాస రావు తండ్రి కూడా తోడయ్యాడు. అతను ఆ గ్రామాని మాజీ సర్పంచ్. ప్రతి గుడికి తీసుకెళ్తూ.. మరోసారి ఆ పని చేయనంటూ ఆమె చేత చెప్పిస్తూ చెంపలేయించారు. ఇంత దారుణం జరుగుతున్న ఏ ఒక్కరు ఆమెకు మద్దతుగా రాలేదు. అనంతరం కాపురం చేయలేనంటూ పుట్టింటికి పంపించాడు. అయితే బంధువులు వత్తడి తీసుకురావడంతో భాగ్యలక్ష్మిని ఇంటికి తీసుకువచ్చాడు. వేరే గదిలో ఉండాలంటూ హెచ్చరించాడు. అక్కడితో ఆగకుండా ఆమెకు గుండు కొట్టించాడు. గ్రామంలోని వీధుల్లో నడిపిస్తూ, బొడ్డురాయి వద్దకు తీసుకెళ్లాడు. ‘తాను తప్పు చేశానని, క్షమించమ’ని ఆమెతో చెప్పిస్తూ... టెంకాయ కొట్టించాడు. నాలుగు రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి భాగ్యలక్ష్మిని విచారించగా.. ఫిర్యాదు ఇవ్వడానికి ఆమె నిరాకరించింది. కుటుంబ సభ్యుల మద్దతుతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.