భార్య ఏటీఎం కార్డు... భర్త వాడకూడదు

భార్య ఏటీఎం కార్డు... భర్త వాడకూడదు

నియమ నిబంధనలను సరిగా అర్థం చేసుకోకుండా ఏటీఎం కార్డును వాడితే చాలా సమస్యలు ఉంటాయి. బెంగళూరు నగరంలోని మర్తనహళ్ళికి చెందిన వందన అనే మహిళ రూ. 25,000 సొమ్ము డ్రా చేసుకు రమ్మని తన ఎస్‌బీఐ ఏటీఎం కార్డును, పిన్‌ నంబర్‌ను భర్త రాజేష్‌కు ఇచ్చింది. రాజేష్‌ ఏటీఎం కార్డును వాడగా, డబ్బు రాలేదు కాని.. ఆ మొత్తం ఖాతాలో డెబిట్‌ అయినట్లు (అంటే డ్రా చేసినట్లు) వచ్చింది. ఇది జరిగింది 2013 నవంబర్‌ 14న. ఈ వ్యవహారాన్ని బ్యాంకు దృష్టికి తీసుకెళ్ళారు దంపతులు. అయితే ఎస్‌బీఐ డబ్బు ఇచ్చేందుకు నిరాకరించింది. ఎందుకంటే ఏటీఎం కార్డు నాన్‌ ట్రాన్స్ ఫరబుల్‌. అంటే వేరొకరికి ఇవ్వరాదు. ఏటీఎంని వాడింది వందన (ఏటీఎం కార్డు ఓనర్‌) కాదు కాబట్టి.. తాము ఆమె పిటీషన్‌ను స్వీకరించలేమని స్పష్టం చేసింది. 

నగరంలోని 4వ అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్‌ను వందన ఆ్రశయించింది. ఆ సమయంలో గర్భవతినైన తాను కదలలేని స్థితిలో ఉన్నందువల్ల తన భర్తకు కార్డు ఇచ్చినట్టు వివరించింది. డబ్బు రాలేదని తెలిసిన వెంటనే రాజేష్‌.. బ్యాంక్‌ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారని వందన పిటీషన్‌లో పేర్కొంది. ఎంతో కష్టపడి సంపాదించిన ఏటీఎం సీసీటీవీ ఫుటేజీని కూడా ఫోరమ్‌ ఎదుట పెట్టింది. అలాగే ఆర్‌టీఐ చట్టం ద్వారా సదరు ఏటీఎం మెషిన్ నుంచి సొమ్ము జమ, విత్‌డ్రాయల్‌ డేటాను కూడా సంపాదించింది. లెక్క ప్రకారం ఆ ఏటీఎం మెషిన్ లో రూ. 25,000 అధికంగా ఉన్నట్లు తేలింది.  అయితే సదరు ఏటీఎంలో అదనపు క్యాష్‌ లేదంటూ ఎస్‌బీఐ కోర్టుకు తెలిపింది. దీంతో వ్యవహారం అంబుడ్స్‌మన్‌ దగ్గరకు వెళ్ళింది. పిన్‌ షేర్‌ చేసినందున... ఈ పిటీషన్‌ను స్వీకరించనని అంబుడ్స్‌మన్‌ కూడా తేల్చారు. మూడున్నరేళ్ళు వందన కోర్టు చుట్టూ తిరిగారు. ఏటీఎంలో జరిపిన లావాదేవీ సక్రమంగా ఉన్నట్లు ఎస్‌బీఐ రికార్డులు, లాగ్‌లతో సహా కోర్టుకు  సమర్పించింది. ఎట్టకేలకు మే 29న కోర్టు వందన కేసును కొట్టివేసింది. ఆమె సెల్ఫ్ చెక్‌ లేదా ఆథరైజేషన్‌ లెటర్‌ ఇచ్చి సొమ్ము విత్‌డ్రా చేసుకోవాల్సిందని.. పిన్‌ను మరొకరితో షేర్‌ చేసుకోవడంతో ఆమె వాదన చెల్లదని కోర్టు తేల్చింది.