వికారాబాద్ అడవుల్లో కాల్పుల కలకలం...

వికారాబాద్ అడవుల్లో కాల్పుల కలకలం...

బడాబాబుల కాల్పుల సరదా మూగజీవుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. పూడూరు మండల పరిధిలోని ఫాంహౌస్‌ల సమీపంలో చోటు చేసుకున్న రెండు సంఘటనలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో నాటు తుపాకీతో కుక్కలను కాల్చి.. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వేటగాళ్లు..అప్పట్లో సంచలనం సృష్టించారు. ఇప్పుడు దామగుండంలో కాల్పులు ఆవు ప్రాణాలు తీశాయి. పశువులను మేత కోసం అడవులకు తీసుకెళ్తే వేటగాళ్ళ కాల్పులకు ముగజీవాలు బలవుతున్నాయి. పుడూరు మండలంలోని దామగుండానికి చెందిన రైతు పశువులను మెపే క్రమంలో అడవుల్లోకి వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆవు మృత్యువాత పడగా.. గేదె శరీరంలో నుంచి బుల్లెట్ బయటకు తీశారు. ఈ ఘటన పై బాధిత రైతు భయాందోళనకు గురైయాడు. 

ఆవుపై కాల్పులు జరిపిన ఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ, విహెచ్పి, గో సంరక్షణ సమితి, ఇతర గో ఆశ్రమ నిర్వాహకులు కాల్పుల ఘటనపై మందుపడుతున్నారు. ఈ ఘటన పై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి దర్యాప్తు వేగవంతం చేయాలని.. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామంటున్నారు హిందూ సంఘాల ప్రతినిధులు. అయితే కాల్పుల కేసులో కొంత పురోగతి కనిపిస్తుంది. పూడూరు పరిధిలో ఉన్న ఫామ్ హౌజ్ ల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.