కృష్ణమ్మ ఉగ్రరూపం.. వణుకుతోన్న లంకగ్రామాలు

కృష్ణమ్మ ఉగ్రరూపం.. వణుకుతోన్న లంకగ్రామాలు

భారీవర్షాలు, వరదలతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. పదేళ్లలో ఎన్నడూ లేని వరదతో పోటెత్తుతోంది. శ్రీశైలం డ్యామ్‌కు వరద భారీగా పెరిగింది. శనివారం ఉదయం దాదాపు ఏడు లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో పది గేట్లను 25 అడుగుల వరకు ఎత్తి నీటిని నాగార్జున సాగర్‌కు వదిలారు. ఈనీరంతా ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు ఇతర మార్గాల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వచ్చింది. వచ్చిన నీటిని వచ్చినట్లే అధికారులు కిందకు వదులుతున్నారు. భారీ వర్షాల కారణంగా పంట పొలాలు ముంపునకు గురవడంతో కృష్ణా కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. 
 
అటు, గుంటూరు జిల్లాలోని కృష్ణానది తీరప్రాంత లంక గ్రామాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. మూడు రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ ఉన్న వరద లంక గ్రామాలను భయపెడుతోంది. శుక్రవారం నుంచి గ్రామాలకు రవాణా నిలిచిపోయింది.  నిత్యవసరాల కోసం వెళ్లేందుకు పడవలూ అందుబాటులో లేకపోవడంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అల్లాడిపోతున్నారు.  ప్రకాశం బ్యారేజికి దిగువన తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో కృష్ణా నది వరద ఉధృతి పెరగడంతో.. లంకగ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, కరోనా భయంతో కొన్ని లంక గ్రామాల్లో ప్రజలు పిల్లలు, వృద్ధులను తీసుకుని గుంపుగా పునరావాస కేంద్రాల్లో ఉండేందుకు ధైర్యం చేయలేక వరద నీటితో నిండిన ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు. 
 
వరద ముంపు గ్రామాల్లో ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వాన వీడినా ఎగువ నుంచి వస్తున్న వరద నీరు కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలోని ఉప్పుటేరు ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆకివీడు, కాళ్ల మండలాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ మండలాల్లో సుమారు 14 గ్రామాల ప్రజలు.. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. భారీ వర్షాలు, వరదతో కృష్ణాజిల్లా రైతులు వేల హెక్టార్లలో పంటలను నష్టపోయారు. శనివారం నాటికి జిల్ల్లాలో 23వేల హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, 6వేల 164 హెక్టార్లలో ఉద్యానపంటలు నీటమునిగాయని అధికారులు గుర్తించారు.