తెలంగాణలో వీసీ పోస్ట్‌లకు గిరాకీ పెరిగిందా?

తెలంగాణలో వీసీ పోస్ట్‌లకు గిరాకీ పెరిగిందా?

తెలంగాణలో యూనివర్సిటీ వీసీ పోస్ట్‌లకు గిరాకీ పెరిగిందా? మిగతా వాటితో పోలిస్తే ఆ ఒక్క దానికి డిమాండ్‌ ఓ రేంజ్‌లో ఉందా? ఉస్మానియా విశ్వవిద్యాలయం కోసం పోటీ పడుతున్న ఆ ఇద్దరు ప్రముఖుల గురించి జరుగుతున్న చర్చ ఏంటి? 

వీసీ పోస్టుల కోసం ఆశావహుల లాబీయింగ్‌!
తెలంగాణలో పలు వర్సిటీలకు వైస్‌ ఛాన్స్‌లర్స్‌ లేక ఏడాది కావొస్తోంది. ఇంఛార్జ్‌ల పాలనలోనే నెట్టుకొస్తున్నాయి. విశ్వవిద్యాలయాలకు ఉప కులపతుల నియామకాన్ని వెంటనే పూర్తి చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో విద్యాశాఖ వర్గాల్లో కదలిక వచ్చింది. అదే సమయంలో ఆసక్తికర చర్చ కూడా మొదలైంది. వీసీ కావాలని చూస్తోన్న వారి గుండెల్లో గుబులు ప్రారంభమైందట. ఆశావహులు ఇప్పటికే తమ పరిచయాల ద్వారా లాబీయింగ్‌ ముమ్మరం చేశారట. 

అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ వీసీ పోస్ట్‌ కోసం 157 అప్లికేషన్స్‌!
పది వర్సిటీల వీసీల నియామకానికి  ప్రభుత్వం సెర్చ్‌ కమిటీలు వేసింది. ఈ కమిటీల భేటీ త్వరలోనే జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 9 ప్రధాన వర్సిటీలకు కలిపి 935 అప్లికేషన్స్‌ వచ్చాయట. వీటిల్లో ఒకే వ్యక్తి పలు వర్సిటీలకు దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించారట.  ఒక్క పొట్టి శ్రీరాములు వర్సిటీకి తప్ప మిగతా అన్ని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తులు సెంచరీ దాటాయట. కాకపోతే ఎక్కువ దరఖాస్తులు అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీకి వచ్చినట్లు సమాచారం. ఈ యూనివర్సిటీకి వీసీ అయ్యేందుకు 157  మంది అప్లికేషన్స్‌ పెట్టారట. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి అతి తక్కువగా 23 దరఖాస్తులే వచ్చాయని అంటున్నారు. 

పెద్దగా తలనొప్పులు ఉండవనే ఓపెన్‌ వర్సిటీకి పోటీ పడుతున్నారా? 
ఉస్మానియా వర్సిటీకి 114 మంది, కాకతీయ వర్సిటీకి 110, JNTUకి 56, తెలంగాణ వర్సిటీకి 114, శాతవాహన వర్సిటీకి 115, పాలమూరు వర్సిటీకి 122, మహాత్మాగాంధీ యూనివర్సిటీకి 124 అప్లికేషన్స్‌ వచ్చాయట. వీటిల్లో అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అయితే పేరుకు పేరు ఉంటుంది.. పెద్దగా తలనొప్పులు ఉండవనే ఆలోచనతో చాలా మంది అక్కడ VC పోస్ట్‌కు పోటీ పడుతున్నట్లు కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ఓయూ వీసీకి దరఖాస్తు చేసిన  ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్లు!
తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ముగిసింది. కరోనా కారణంగా కమిటీ పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుత పాలకమండలిలో ఉన్న ఇద్దరు వైస్‌ చైర్మన్‌లు ప్రొఫెసర్‌ లింబాద్రి, ప్రొఫెసర్‌ వెంకట రమణలు కూడా వీసీ పోస్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారట. కాకపోతే ఇద్దరూ ఒకే వర్సిటీ OUకి దరఖాస్తు చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారట. వీరిద్దరూ వివాద రహితులు కావడం.. ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్లుగా ఎలాంటి ఆరోపణలు లేకుండా పనిచేశారనే అభిప్రాయం ఉండటంతో ఎవరు వీసీ అవుతారో అన్న ఉత్కంఠ నెలకొందట. ఇదే సమయంలో మిగతా వర్సిటీలకు దరఖాస్తు చేసుకున్నవారు సైతం పెద్ద స్థాయిలో లాబీయింగ్‌ చేస్తున్నట్లు.. అంతా సీఎం కేసీఆర్‌ ఆశీసుల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.