చిత్తూరు మేయట్‌ పీఠంకోసం పోటా పోటీ...

చిత్తూరు మేయట్‌ పీఠంకోసం పోటా పోటీ...

టిక్కెట్ల దగ్గర పోటీ.. గెలిచాక కుర్చీ కోసం పోటీ. మెజారిటీ సీట్లు ఏకగ్రీవమైనా సీన్‌ మారలేదు. చిత్తూరు కార్పొరేషన్‌ మేయర్‌ పదవికోసం అధికార పార్టీ ఎమ్మెల్యేకు, మంత్రి అనుచరులకు మధ్య గట్టి పోటీ నడుస్తోందట. 50 డివిజన్లలో 37 ఏకగ్రీవాలు చేసుకున్నాం..ఇంకేముంది మన వాళ్ళు మేయర్ పీఠం గెలుచుకోవటం ఖాయం అనుకుంటున్న టైంలో సీన్‌ మారింది. మంత్రి అనుచరులు ఎమ్మెల్యేకి షాక్‌ ఇచ్చారట. ఇకలాభం లేదని ఎమ్మెల్యే కూడా ...సై అంటే సై అంటున్నారట. దీంతో అక్కడ కార్పొరేషన్ పీఠం... మంత్రి అనుచరులకా లేక ఎమ్మెల్యేకా అన్న చర్చ జిల్లా వైసీపీలో జోరుగా సాగుతోంది

మునిసిపల్ ఎన్నికలు ముగిసినా కొన్ని చోట్ల ఆ వేడి ఇంకా తగ్గలేదు. చిత్తూరులో అధికార పార్టీ నేతలు నువ్వా నేనా అని బలప్రదర్శనకు దిగుతున్నారు. గతంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ, ఈసారి మాత్రం దాని తీవ్రత మరింత పెరిగింది. చిత్తూరు మునిసిపల్ ఎన్నికల్లో సీట్ల పంపకంతో రెండుగా చీలింది జిల్లా వైసీపీ. పార్టీ కోసం కష్టపడిన వారీకి సీట్లు ఇవ్వాలని మంత్రి అనుచరులైన బుల్లెట్ సురేష్, విజయానందరెడ్డి పట్టుబడుతున్నారు. పార్టీకి ఎవరు పనిచేశారో నాకు తెలుసంటున్నారు ఎమ్మెల్యే ఆరిణి శ్రీవాసులు. ఇక్కడే వివాదం మొదలైంది. 

దీంతో లోకల్ ఎమ్మెల్యే మొదటి నుండి తమకు సహకరించడం లేదని పెద్దిరెడ్డికి ఫిర్యాదులందడంతో దగ్గరుండి మరీ సీట్ల పంపకం చేశారట మంత్రి పెద్దిరెడ్డి. చిత్తూరు కార్పొరేషన్‌ లో మొత్తం 50 డివిజన్లలో ఇప్పటికే 37 ఏకగ్రీవమై చిత్తూరు కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది వైకాపా. మిగిలిన 13 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి.  ఏకగ్రీవమైన 37డివిజన్లలో ఎమ్మెల్యే వర్గంనుంచి 10 మంది మాత్రమే ఉన్నారు.  దీంతో 27మంది గెలిచిన తమ వర్గానికే మేయర్, డిప్యూటి మేయర్ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే ప్రత్యర్ధి వర్గం డిమాండ్లు మొదలు పెట్టింది. అంతే కాకుండా, 27 మంది కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం మంత్రి పెద్దిరెడ్డిని కలవడం చిత్తూరు నగరంలో మరింత హాట్ టాపిక్ గా మారింది. అనుకోని ఈ బలప్రదర్శనతో ఎమ్మెల్యే వర్గానికి మైండ్ బ్లాక్ అయినంత పనైందని జిల్లా వైసీపీలో టాక్ నడుస్తోంది.

ఈ పరిణామాలతో చిత్తూరు మునిసిపల్ కార్యాలయాన్ని తన ఆధీనంలోనే ఉంచుకోవాలన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. నిజానికి 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు నుంచే ఈ గ్రూప్‌ వార్ నడుస్తూ ఉంది. అయినా పెద్దిరెడ్డి మాట ప్రకారం చిత్తూరులో పార్టీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేశారు. అప్పటినుండి నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఇప్పుడు బయటపడినట్టు టాక్‌ నడుస్తోంది. ఇప్పుడు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవి కోసం రెండు వర్గాలూ సై అంటే సై అంటున్నాయి. ఎవరికి వారు మాకంటే మాకే అని ధీమా ప్రదర్శిస్తున్నారట.