హృతిక్ 75 కోట్ల డీల్ వదిలేశాడా?

హృతిక్ 75 కోట్ల డీల్ వదిలేశాడా?

మామూలు హీరోలే కాదు... స్టార్ హీరోలు కూడా మెల్లగా డిజిటల్ బాట పడుతున్నారు. వెబ్ సిరీస్ ల పట్ల క్రేజ్ రోజురోజుకి పెరుగుతోంది. అయితే, హృతిక్ మాత్రం... చివరి నిమిషంలో ఓటీటీని వద్దనుకున్నాడు. 75 కోట్ల భారీ డీల్ సైతం వదులుకున్నాడట! హృతిక్ రోషన్ స్టార్ డమ్, స్టామినా ఏంటో మనకు తెలిసిందే. ‘వార్’ లాంటి సినిమాలో అల్ట్రా మాడ్రన్ గా కనిపిస్తాడు. అదే సమయంలో, ‘సూపర్ 30‘లో నటనతోనూ మెప్పిస్తాడు. ఎలాంటి పాత్రనైనా పర్ఫెక్ట్ గా స్క్రీన్ పై పర్ఫామ్ చేసే ఆయన కొన్నాళ్ల కిందట ఓ వెబ్ సిరీస్ కి సై అన్నాడు. డిస్నీ హాట్ స్టార్ వారితో చర్చలు కూడా జరిగాయి.

అయితే, హృతిక్ చేయాలనుకున్న సిరీస్ మామూలుది కాదు. బ్రిటన్ లో సూపర్ సక్సెస్ అయిన ‘ద నైట్ మ్యానేజర్’ కథతో ఇండియన్ నేటివిటికి తగ్గట్టుగా అడాప్ట్ చేద్దామనుకున్నారు. ‘ద నైట్ మ్యానేజర్’ వెబ్ సిరీస్ లో జోనాథన్ పైన్ క్యారెక్టర్ ని నటుడు టామ్ హిడిల్ స్టన్ పోషించాడు. అదే రోల్ ఇక్కడ హృతిక్ చేయాల్సింది. నిజానికి ఈ వార్త విన్న ‌ఫ్యాన్స్  కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ, లెటెస్ట్ టాక్ మాత్రం డిజపాయింటింగ్ గా వినిపిస్తోంది. కారణం సరిగ్గా తెలియనప్పటికీ, హృతిక్ ‘ద నైట్ మ్యానేజర్’ వెబ్ సిరీస్ రీమేక్ నుంచీ తప్పుకున్నాడట.

ఎక్కువ రోజులు డేట్స్ కేటాయించాల్సి రావటమే ప్రధాన సమస్య అని కొందరు చెబుతున్నారు. హృతిక్ మాత్రం దీనిపై అధికారికంగా స్పందించలేదు. డిస్నీ హాట్ స్టార్ కూడా ఇంకా రియాక్ట్ అవ్వలేదు. కానీ, ‘ద నైట్ మ్యానేజర్’ ఇండియన్ వర్షన్ రూపొందించాలనుకున్న దర్శకనిర్మాతలు మాత్రం మూడ్ ఆఫ్ లో ఉన్నారట. మార్చ్ నుంచీ సెట్స్ మీదకి వెళ్లాలని భావిస్తుండగా హృతిక్ ఇలా షాక్ ఇవ్వటం వారికి మింగుడుపడటం లేదట! ఒకవేళ నిజంగానే హృతిక్ డిజిటల్ డెబ్యూ వాయిదా పడితే... ఆయన్ని మనం నెక్ట్స్ చూడబోయేది... ‘క్రిష్ 4’ మూవీలోనే!