కన్నాకు అధ్యక్ష పదవి వెనుక ఏం జరిగిందంటే!

కన్నాకు అధ్యక్ష పదవి వెనుక ఏం జరిగిందంటే!

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణకు అనూహ్యంగా అవకాశం దక్కింది... ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను, ఏపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా సోము వీర్రాజును నియమిస్తూ ప్రకటన జారీ చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా. పార్టీ అధ్యక్ష పదవి దక్కదనే లీక్‌లతో బీజేపీని వీడి వైసీపీలో చేరాలనుకున్న కన్నాకు అసలు అధ్యక్ష పదవి ఎలా దక్కిందనేది ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో చర్చగా మారింది. 

బీజేపీ ఏపీ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేయడంతో ఇక కన్నా లక్ష్మీనారాయణనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడంటూ ప్రచారం జరిగింది... అయితే చివరి నిమిషంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేరు తెరపైకి వచ్చింది. త్వరలోనే బీజేపీ ఏపీ చీఫ్‌గా సోము పేరును ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది... దీంతో కొంత నొచ్చుకున్న కన్నా... బీజేపీ గుడ్‌బై చెప్పి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైపోయారు. అయితే వైసీపీలో చేరికకు ఒక్కరోజు ముందే ఆయన అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు... దీంతో అనూహ్యంగా వైసీపీలో చేరిక వాయిదా పడింది. ఇక్కడే పరిణామాలన్నీ మారిపోయాయి. ఓ వైపు వైసీపీ నేతలు, మరోవైపు టీడీపీ నేతలు, ఇంకో వైపు బీజేపీ నేతలను తన చుట్టూ తిప్పుకున్నాడు కన్నా లక్ష్మీనారాయణ. 

కన్నా కోసం ఏపీ మంత్రులే రంగంలోకి దిగారు... బీజేపీ వీడేందుకు సిద్ధంగా ఉండడంతో టీడీపీలో చేరాలని పలుమార్లు కన్నాను కోరారు. ఈ నెల 9వ తేదీన రాత్రి హైదరాబాద్‌లో ఏకంగా దాదాపు 6 గంటల పాటు టీడీపీ ప్రతినిధులు కన్నాతో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ ఆహ్వానంపై కన్నా ఎటూ తేల్చుకోలేకపోయారు... ఆరోగ్యం కుదుటపడగానే వైసీపీలో చేరతారనే ప్రచారం కూడా సాగింది. ఇక బీజేపీ కీలక నేతలు సైతం కన్నా కోసం రంగంలోకి దిగాల్సి వచ్చింది... ఏపీలోనీ బీజేపీ నేతలతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కూడా పలుమార్లు ఆయనతో ఫోన్‌లో చర్చలు జరిపారు... పార్టీ వీడొద్దని సముదాయించారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా కన్నా పేరు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. బ్లాక్‌మెయిల్ రాజకీయాలతోనే కన్నా అధ్యక్ష పదవి దక్కించుకున్నాడనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరో వైపు సోము వీర్రాజు పేరుపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడం కూడా కన్నాకు కలిసి వచ్చిందంటున్నారు.