ప్రధాని కుర్చీ కోసం తొందరెందుకు..

ప్రధాని కుర్చీ కోసం తొందరెందుకు..

ఇది విశ్వాస పరీక్ష కాదు... ప్రతిపక్షాల బలపరీక్ష అంటూ అవిశ్వాస తీర్మానంపై సెటైర్లు వేశారు ప్రధాని నరేంద్ర మోడీ... అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై సమాధానమిచ్చిన పీఎం... ప్రధాని కుర్చీపై కూర్చోడానికి అంత తొందరెందుకంటూ రాహుల్‌ గాంధీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇది కాంగ్రెస్‌ అధ్యక్షుని అహంకారాన్ని, ప్రధాని కుర్చీని దక్కించుకోవాలన్న ఆతృతను చూపిస్తోందని విమర్శలు గుప్పించారు మోడీ. ఇది విశ్వాస పరీక్ష కాదని... ప్రధాన ప్రతిపక్షం, దాని మిత్రులుగా భావించే పార్టీల బలపరీక్ష అంటూ ఎద్దేవా చేశారు. తమవి ఓటు బ్యాంకు రాజకీయాలు కావని ప్రకటించిన మోడీ... సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌ అన్న మంత్రంతో ముందుకు వెళ్తున్నామన్నారు. 

ఇక 2024లోనూ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే బలాన్ని విపక్షాలకు ఇవ్వాలని తాను భగవంతుడిని ప్రార్థిస్థాను అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు ప్రధాని మోడీ... 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామని... దేశ ప్రజలకు వివిధ రూపాల్లో లబ్ధి కలిగించడానికి తమ సర్కార్‌ అనేక చర్యలు చేపడుతుంటే... విపక్షాలు వాస్తవాలను విశ్వసించడం లేదని... మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌కు అదిలేదన్నారు. చీఫ్ జస్టిస్‌, ఎన్నికల కమిషన్‌, ఈవీఎంలపైనా ప్రతిపక్షాలనికి విశ్వాసం లేదన్న మోడీ... కానీ, తమపై తమకు నమ్మకం లేనివారు ఎవరినీ విశ్వసించరంటూ మండిపడ్డారు. ఇక సున్నితమైన విషయాలపై కూడా రాహుల్ పిల్లాడిలా మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు మోడీ... రాఫెల్‌ ఒప్పందంపై రాహుల్‌ చేసిన ఆరోపణలపై సమాధానమిచ్చిన ప్రధాని... మెరుపుదాడుల్ని ‘జుమ్లా స్ట్రైక్స్‌’గా పేర్కొనడం మన సైనిక బలగాలను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ప్రధాని చౌకీదార్‌ కాదు భాగీదార్‌ అన్న రాహుల్‌ విమర్శలకు... తాను ప్రజల ఆకాంక్షల్లో భాగస్వామినని... కాంగ్రెస్‌ మాదిరిగా తాను సౌదాగర్‌, టేకేదార్‌ను కాదన్నారు. తన కళ్లలోకి నేరుగా చూడలేరంటూ రాహుల్‌ చేసిన విమర్శపై స్పందించిన మోడీ... తాను కళ్లలో కళ్లు పెట్టి చూడలేనని... అలా చేసిన ప్రముఖులు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌లు ఇబ్బంది పడ్డారని వ్యాఖ్యానించారు. రాహుల్ నామ్‌ధార్‌, నేను కామ్‌ధార్‌ నని... మీ కళ్లలోకి నేరుగా చూడలేనంటూ రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మోడీ.