హైదరాబాద్ లో మళ్ళీ మొదలయిన కుండపోత వర్షం

హైదరాబాద్ లో మళ్ళీ మొదలయిన కుండపోత వర్షం

హైదరాబాద్ పై వరుణుడు పగబట్టాడా ? ఇప్పటికే నగరాన్ని నిండా ముంచిన వర్షం మరోసారి భారీస్థాయిలో విరుచుకు పడుతోందా ? వరద, బురద నుంచి ఇంకా నగర వాసులు కోలుకోనేలేదు... మళ్లీ హైదరాబాద్ లో వర్షం పడుతుండటం నగరవాసుల్ని కలవరానికి గురిచేస్తోంది.  కూకట్‌పల్లి, ప్రగతినగర్, జేఎన్టీయూ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్‌లో భారీ వర్షం పడుతోంది. అటు దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, ఎల్బీనగర్‌లో కుంభవృష్టి కురుస్తోంది.

తెలంగాణలో పలుచోట్ల వచ్చే రెండ్రోజులు భారీ వానలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఈశాన్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కూడా తోడైంది. దీంతో వచ్చే మూడు రోజులు తెలంగాణలో వర్షం ముప్పు పొంచి ఉంది. అటు దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, ఎల్బీనగర్‌లో కుంభవృష్టి కురుస్తోంది. రోడ్లపైకి చేరిన నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది.

ఇక హైదరాబాద్‌ ప్రజలను వరద, బురద కష్టాలు వీడడం లేదు. చాలా ప్రాంతాల నుంచి ఇంకా వరద నీళ్లు, బురద తొలగిపోలేదు. ఫలక్‌నుమాలోని చాలా వీధులు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. నీళ్లు కొద్దిగా తగ్గడంతో జనం ఇళ్లను, వాహనాల్ని శుభ్రం చేసుకుంటున్నారు. మరోవైపు GHMC సిబ్బంది రోగాలు ప్రబలకుండా వీధుల్లో ద్రావణాలు పిచికారీ చేస్తున్నారు. అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోనూ బురద తొలగించేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈలోపే మళ్ళీ వర్షం పడడం తలనొప్పిగా మారింది.