11కు చేరిన క్వారీ మృతుల సంఖ్య

11కు చేరిన క్వారీ మృతుల సంఖ్య

కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగళ్ లోని మైనింగ్ క్వారీలో శుక్రవారం రాత్రి జరిగిన భారీ పేలుడులో మృతి చెందిన వారి సంఖ్య 11కు చేరింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే క్వారీలోని పేలుడుకు మంటలు అంటుకుని అక్కడి షెడ్డు, లారీ, మూడు ట్రాక్టర్లు దగ్ధమయ్యాయి. ఈ పేలుడు వలన హత్తిబెళగళ్ లోని పలు ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. మృతులు అందరూ ఒడిశా, ఛత్తీస్ ఘడ్ కు చెందిన కార్మికులుగా గుర్తించారు. శ్రీనివాస్ చౌదరి కంపెనీకి చెందిన క్వారీలో రాళ్ల మధ్య భారీ మొత్తంలో జిలెటిన్ స్టిక్స్ తో పాటు కెమికల్స్ కూడా వాడినందు వలెనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు గుర్తించారు.

ప్రమాదంలోని మృతుల కుటుంబాలను ఆదుకుంటామని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యంను అందిస్తున్నామని కర్నూలు కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే క్వారీ యజమానులు పరారీ అయ్యారని.. వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు.