గవర్నర్ కి ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిందా...?

గవర్నర్ కి ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిందా...?

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే.. తెలంగాణలో మొదటి నుంచీ ముఖ్యమంత్రి కార్యాలయం రాజ్‌భవన్‌తో సత్ససంబంధాలనే కొనసాగిస్తోంది. కానీ.. గత కొన్నాళ్లుగా ఈ ధోరణి మారుతోందా? ఒకదాని తర్వాత మరో అంశంలో రాజ్‌భవన్‌ ప్రగతిభవన్‌ల మధ్య దూరం పెరుగుతోందా? తాజాగా  ఆయుష్మాన్‌ భారత్‌, ఆరోగ్యశ్రీల విషయంలో ఈ పంతం ఎక్కడిదాకా వెళ్తుంది? 

ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేయాలన్న గవర్నర్‌!
రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ మధ్య గ్యాప్‌?

తెలంగాణ గవర్నర్‌గా డాక్టర్‌ తమిళిసై బాధ్యతలు చేపట్టి ఏడాదైంది. ఈ సంవత్సర కాలంలో జరిగిన వ్యవహారాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రగతిభవన్‌తో రాజ్‌భవన్‌ను అనుసంధానం చేస్తానని చెప్పారు తమిళిసై. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ను తెలంగాణ సర్కార్‌ కూడా అమలు చేయాలని కోరారు. అయితే యాదృశ్చికంగా అదే సమయంలో ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఇద్దరి కామెంట్స్‌ను పరిశీలించినవారు రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్‌ మధ్య దూరం ఉందని గుసగుసలాడుకుంటున్నారు. 

ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్యశ్రీ బెటరన్న సీఎం కేసీఆర్‌!

కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ కంటే.. తెలంగాణ సర్కార్‌ అమలు చేస్తోన్న ఆరోగ్యశ్రీ పథకం ఎంతో భేష్‌ అని అసెంబ్లీలో ఆన్‌రికార్డ్‌ వెల్లడించారు సీఎం కేసీఆర్‌. అంతేకాదు.. ఆయుష్మాన్‌ భారత్‌ పేరుతో ఆరోగ్యశ్రీకి తూట్లు పొడితే ప్రచారాన్ని బీజేపీ నాయకులు మానుకోవాలని చురకలు వేశారు. కేంద్ర పథకాన్ని అమలు చేయాలని గవర్నర్‌ కోరినా.. తాను ఇదే సమాధానం చెప్పానని వెల్లడించారు. కొన్ని రాష్ట్రాలో ఆయుష్మాన్‌ భారత్‌ నిధులు తీసుకుని  వివిధ ఆరోగ్య పథకాలు అమలు చేస్తున్నాయని.. తెలంగాణకు కూడా ఆ విధంగా నిధులు ఇస్తే..  ఆరోగ్యశ్రీకి వాడుకుంటామని స్పష్టం చేశారు సీఎం. 

ఏడాది కాలంగా పలు అంశాలలో విభేదాలు!

ఒకే అంశంపై ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో గవర్నర్‌ తమిళిసై అలా.. సీఎం కేసీఆర్‌ ఇలా  ప్రకటనలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. పైగా తన సూచనలను రాష్ట్ర సర్కార్‌  పాటిస్తోందని గవర్నర్‌ చెప్పడాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. వాస్తవానికి ఏడాది కాలంగా రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ల మధ్య చాలా విషయాల్లో విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం కరోనాను తక్కువ అంచనా వేసిందని నేషనల్‌ మీడియాలో తమిళిసై కామెంట్స్‌ కాస్త వేడిపుట్టించాయి. 

రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని ప్రకటన!

మరో సందర్భంలో భార్యల అధికారంతో భర్తలు జల్సా  చేయొద్దని..  ఫోరంఫర్‌ గుడ్‌గవర్నెన్స్‌ రాసిన లేఖకు స్పందనగా ప్రభుత్వానికి లేఖ రాశారు గవర్నర్‌. దీంతో ఆ విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయాల్సి వచ్చింది. ప్రజలను నేరుగా కలిసేందుకు రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని గవర్నర్‌ చేసిన ప్రకటన చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడేందుకు ప్రజలకు సమయం ఇవ్వాలని సూచించారు. ఇప్పుడు ఆయుష్మాన్‌ భారత్‌, ఆరోగ్యశ్రీల విషయంలో పొంతనలేని ప్రకటనలు కొత్త చర్చకు కారణమయ్యాయి. మరి.. ఈ అంశం ఇక్కడితో ఆగుతుందో.. ఇంకా విస్తృతం అవుతుందో చూడాలి.