కాంగ్రెస్‌ గూటికి హార్ధిక్ పటేల్..!

కాంగ్రెస్‌ గూటికి హార్ధిక్ పటేల్..!

హార్ధిక్ పటేల్.. ఈ పేరు దేశ రాజకీయాల్లో పెను సంచలనం... గుజరాత్‌లోని పాటిదార్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉద్యమానికి తెరలేపిన ఆయన... అనాదికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, హార్థిక్ పటేల్.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరిక మేరకు ఈ నెల 12వ తేదీన ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారనే ప్రచారం సాగుతోంది. ఇక సార్వత్రిక ఎన్నికల్లో జామ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జామ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ పూనాంబెన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అహ్మదాబాద్‌లో జరనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సందర్భంగా హార్థిక్ పటేల్... రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం సాగుతోంది. ఈ మీటింగ్ తర్వాత భారీ ర్యాలీని నిర్వహించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్లాన్ చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌పై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ... ఆ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా హార్థిక్ పటేల్ కీలకంగా వ్యవహరించారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ లోక్‌సభ స్థానాలు గెలుచుకునే విధంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది.