కరోనా దెబ్బ.. దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్ రంగం కుదేలు..!

కరోనా దెబ్బ.. దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్ రంగం కుదేలు..!

కరోనావైరస్ అన్ని రంగాలను దెబ్బ కొట్టింది.. రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా కుదేలు చేసింది.. ఈ విషయాన్ని రాజ్యసభలో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.. రేరా ప్రాజెక్టుల నిర్మాణానికి గడువును పెంచాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. క్రెడిట్ గ్యారంటీ స్కీం కింద రూ. 10 వేల కోట్ల రుణ సదుపాయం ఉందని.. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా రియల్‌ ఎస్టేట్‌ రంగానికి అనేక ప్రోత్సాహకాలు, రాయితీలను ప్రకటించినట్లు తెలిపారు కేంద్ర మంత్రి. 

హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ ద్వారా రూ. 10 వేల కోట్ల రీఫైనాన్సింగ్‌ సదుపాయాన్ని కల్పించవలసిందిగా రిజర్వ్‌ బ్యాంక్‌ను ఆదేశించినట్లు చెప్పారు హర్దీప్ సింగ్ పురి .. పాక్షిక క్రెడిట్‌ గ్యారెంటీ స్కీమ్‌ కింద నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలకు రూ. 45 వేల కోట్లు, మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలు, హౌసింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలకు వచ్చే ఏడాది మార్చి 31 వరకు రూ. 30 వేల కోట్ల రుణాలు అందుబాటులో ఉంచినట్లు సభలో తెలిపారు. పట్టణ పేదలు, వలస కార్మికుల కోసం ప్రభుత్వం రెసిడెన్షియల్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించే పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు హర్దీప్ సింగ్ పురి.