అలరించే ప్రయత్నంలో అఖిల్ అక్కినేని

అలరించే ప్రయత్నంలో అఖిల్ అక్కినేని

తాత ఏయన్నార్ మహానటుడు. తండ్రి నాగార్జున మంచి నటుడు. అన్న నాగచైతన్య యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ స్థానం సంపాదించాడు. ఇక మిగిలింది అక్కినేని అఖిల్ వంతు. ఏడాది దాటిన వయసులోనే అఖిల్ 'సిసింద్రీ'గా జనాన్ని మెప్పించాడు. అప్పటి నుంచీ అక్కినేని ఇంట మరో ప్రతిభావంతుడు పుట్టాడని జనం భావించారు. దోగాడే పసిపాపగా ఉన్న రోజుల్లోనే అలరించిన అఖిల్ కథానాయకునిగానూ మెప్పిస్తాడని అభిమానులు ఆశించారు. ఎందుకనో వారి ఆశలు అంతగా ఫలించలేదు. ఈ సారి ఎలాగైనా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'గా మెప్పించాలని డిసైడ్ అయ్యాడు అఖిల్. అందులో నాయికగా నటించిన పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా సాగుతోంది. అందువల్ల ఈ సారి ఆమె పాదం అఖిల్ కు అచ్చివస్తుందనే అభిమానులు ఆశిస్తున్నారు. ఈ యేడాది జూన్ లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'గా అఖిల్ జనం ముందు నిలవనున్నాడు. 

ఏవేవో ఆశలు... 
అమ్మ అమల, నాన్న నాగార్జున - ఇద్దరూ తెరపై మేటి నటీనటులుగా వెలిగారు. వారి జీన్స్ అఖిల్ ను సినిమా రంగంవైపే పరుగులు తీయించాయి. చిత్రసీమలోకి యంగ్ హీరోగా అడుగుపెట్టక ముందు అఖిల్ క్రికెట్ లో భలేగా రాణించాడు. ఆస్ట్రేలియా వెళ్ళి క్రికెట్ లో మరీ శిక్షణ తీసుకున్నాడు. ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ కోసం టాలీవుడ్ స్టార్స్ క్రికెట్ ఆడిన సమయంలో అఖిల్ కూడా బ్యాటింగ్ చేసి జనాన్ని ఆకట్టుకున్నాడు. అప్పటి నుంచీ అక్కినేని అభిమానులు అఖిల్ ను తెరపై చూడాలని ఆశిస్తూనే ఉన్నారు. అభిమానుల కోరిక తీర్చడానికి అన్నట్టు అక్కినేని హీరోలు అందరూ కలసి నటించిన 'మనం' చిత్రంలో తాత, తండ్రి, అన్నతో కలసి ఓ సీన్ లో కాసేపు కనిపించాడు. అందులో అఖిల్ ఎంట్రీ చూసిన అభిమానులు ఆనందంతో చిందులు వేశారు.

తరువాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ సోలో హీరోగా 'అఖిల్'మూవీతో ప్రేక్షకుల ముందు నిలిచాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. తరువాత 'హలో'తో ఆకట్టుకొనే ప్రయత్నం చేయగా అదీ అంతగా అలరించలేదు. ఇక తమ అక్కినేని ప్యామిలీకి అచ్చి వచ్చిన 'మజ్ను' టైటిల్ ను తగిలించుకొని 'మిస్టర్ మజ్ను'ని నేనేనంటూ వచ్చాడు. అదీ నిరాశనే మిగిల్చింది. సోలో హీరోగా మూడు సినిమాలతోనూ ఆకట్టుకోలేకపోయిన అఖిల్ రాబోయే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'పైనే గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. 'గీతా ఆర్ట్స్ -2' పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' తెరకెక్కుతోంది. 'బొమ్మరిల్లు' భాస్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. అందువల్ల ఎలాగైనా తమ యంగ్ హీరో హిట్ కొట్టేస్తాడని అక్కినేని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఈ పుట్టినరోజు తరువాతయినా అఖిల్ ఆశించిన అఖండ విజయం అతని దరి చేరుతుందేమో చూడాలి.