బిజీ ... బ్రహ్మజీ!

బిజీ ... బ్రహ్మజీ!

చిత్రసీమ తల్లివంటిది. సినిమా రంగాన్ని నమ్ముకుంటే ఏదో  ఒక రోజున ఆ తల్లి కరుణించక మానదు అంటారు. ఎందరో అలాగే నమ్ముకొని సినిమా రంగంలో తమదైన బాణీ పలికించారు. నటుడు బ్రహ్మాజీ కెరీర్ ను పరిశీలించి చూస్తే అది నిజమే అనిపించక మానదు. తన తరం వారు హీరోలుగా వెలిగినా, ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఉన్నారు. బ్రహ్మాజీ మాత్రం ఇప్పటికీ బిజీగానే సాగుతున్నారు. తనకంటే వయసులో ఎంతో చిన్నవారయిన నటులతోనూ ఫ్రెండ్ గా నటించేస్తూ సందడి చేస్తున్నారు బ్రహ్మాజీ. 

చిత్రంగా... భలే విచిత్రంగా...
బ్రహ్మాజీకి నటుడు కావాలన్న అభిలాష కలిగించిన వారు 'శంకరాభరణం'లో శంకరశాస్త్రిగా నటించిన జె.వి.సోమయాజులు. అదెలాగంటే, బ్రహ్మాజీ తండ్రి తాసిల్దార్ గా పనిచేసేవారు. ఆ సమయంలో జె.వి.సోమయాజులు డిప్యూటీ కలెక్టర్. సోమయాజులు రంగస్థలంపై మేటి నటులు. అందువల్లే 'శంకరాభరణం'లో కీలక పాత్ర పోషించారు. ఆ సినిమా విజయం సాధించిన తరువాత ఏర్పాటు చేసిన సన్మానసభలో బ్రహ్మాజీ తండ్రి, ఆయన సహోద్యోగులు అందరూ, క్యూలో నించుని మరీ సోమయాజులు ఆశీసులు తీసుకున్నారు. ఒక్క సినిమాతోనే సోమయాజులకు అంత కీర్తిప్రతిష్ఠలు రావడం చూసిన బ్రహ్మాజీకి తాను కూడా సినిమా రంగంలో రాణించాలన్న ఆలోచన కలిగింది. అది రోజురోజుకూ పెరిగింది. దాంతో చెన్నై చేరిపోయాడు. ఆరంభంలో బ్రహ్మాజీని భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎస్.గోపాల్ రెడ్డి ప్రోత్సహించారు. ఆయన చిత్రాలతో కాసింత గుర్తింపు వచ్చాక, ఇతరుల సినిమాల్లోనూ నటించసాగారు బ్రహ్మాజీ. తన దరికి చేరిన అన్ని పాత్రలనూ పోషిస్తూ వచ్చారు. ఎక్కువగా నెగటివ్  షేడ్స్ ఉన్న పాత్రలే పలకరించాయి. అయినా నిరుత్సాహ పడలేదు. చిత్రసీమలో వేషాల వేట సాగిస్తూ ఉన్న రోజుల్లోనే బ్రహ్మాజీకి కృష్ణవంశీ, రవితేజ వంటివారితో పరిచయం ఏర్పడింది. కలసి మెలసి ఉంటూ, ఒకరికొకరు కష్టాలు చెప్పుకుంటూ సాగారు. కృష్ణవంశీ కారణంగా రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం 'శివ'లో బ్రహ్మాజీకి ఓ చిన్న వేషం లభించింది. తరువాత కృష్ణవంశీ మొదటి సినిమా 'గులాబి'లో హీరో జేడీ చక్రవర్తికి స్నేహితునిగా ఉంటూనే, మోసం చేసే పాత్రలో నటించారు బ్రహ్మాజీ. ఆ సినిమా మంచి పేరు సంపాదించి పెట్టింది. కృష్ణవంశీ రెండో చిత్రం 'నిన్నే పెళ్ళాడతా'లో కామెడీ మిళితమైన పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. ఇక ఆ పై బ్రహ్మాజీ మరి వెనుతిరిగి చూసుకోలేదు. 

స్నేహబంధంలో...
మిత్రుడు కృష్ణవంశీ ఎప్పటికప్పుడు బ్రహ్మాజీని వైవిధ్యమైన పాత్రల్లో చూపిస్తూ వచ్చారు. బ్రహ్మాజీ హీరోగా 'సిందూరం' నిర్మించి, దర్శకత్వం వహించారు కృష్ణవంశీ. ఆ సినిమా ఆట్టే ఆకట్టుకోలేక పోయింది. అయినా కృష్ణవంశీ చిత్రాల్లో ఏదో ఒక విలక్షణమైన పాత్రలో కనిపిస్తూనే ఉండేవారు బ్రహ్మాజీ. మెల్లమెల్లగా బ్రహ్మాజీ కేరెక్టర్ రోల్స్ లో సెట్ అయిపోయారు. ఆ తరువాత నుంచీ బిజీ బిజీగా సాగుతున్నారు. యంగ్ హీరోస్ సినిమాల్లో బ్రహ్మాజీ ఉండడం ఓ ఎస్సెట్ గా మారిపోయింది. అందువల్ల పలు సినిమాల్లో బ్రహ్మాజీ నవ్విస్తున్నారు, కవ్విస్తున్నారు. సరదాగా సాగిపోతున్నారు. తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించిన బ్రహ్మాజీకి ఇప్పుడు మాతృభాషలోనే తీరిక లేకుండా ఉంది. ఏది ఏమైనా చిత్రసీమలో రాణించాలని వచ్చిన బ్రహ్మాజీ పలు చిత్రాలతో ప్రేక్షకులను  అలరిస్తూనే ఉన్నారు.