అటల్ జీవితం... దేశానికే అంకితం... 

అటల్ జీవితం... దేశానికే అంకితం... 

దేశంలో గొప్ప రాజకీయవేత్తల్లో ఒకరు అటల్ బిహారి వాజ్ పేయి.  దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు.  బీజేపీ పార్టీని స్థాపించిన సమయంలో ఆ పార్టీ దేశం మొత్తం మీద కేవలం రెండు సీట్లు మాత్రమే సాధించింది.  ఈ రెండు సీట్ల స్థానం నుంచి 2019లో 305 సీట్లు గెలుచుకునే వరకు బీజేపీ ఎదగడంలో ప్రముఖ పాత్రను పోషించారు.  1924 డిసెంబర్ 25 వ తేదీన మధ్యప్రదేశ్ లోని గ్యాలియర్లో జన్మించిన అటల్ ప్రాధమిక విద్యాబ్యాసం గ్యాలియర్ లోని సరస్వతి శిశుమందిర్ లోనే జరిగింది.  

1939లో ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయినా అటల్ 1944 నుంచి ఆర్ఎస్ఎస్ పూర్తిస్థాయి కార్యకర్తగా మారారు. 1944లో జరిగిన విభజన అల్లర్లలో భాగంగా ఆయన తన చదువును పక్కన పెట్టి వార్తాపత్రికల్లో జాయిన్ అయ్యారు.  ఒకవైపు ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తూనే అటల్, 1944లో ఆర్యసమాజ్ జనరల్ సెక్రెటరీగా విధులు నిర్వహించారు. 1975 లో ఎమర్జెన్సీ సమయంలో కొంతమంది ప్రతిపక్ష సభ్యులతో కలిసి జైల్లో ఉన్నారు.  

ఇక 1980 ఏప్రిల్ 6 వ తేదీన తన మిత్రుడు ఎల్.కె. అద్వానీతో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. అంతేకాదు, ఆయనే ఆ పార్టీకి మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు.  అప్పట్లో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది.  అయినా ఏ మాత్రం నిరాశ చెందకుండా పార్టీకోసం నిరంతం పనిచేశారు.  1996లో దేశంలో మొదటిసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది.  అటల్ ప్రధాని అయ్యారు.  అయితే లోక్ సభలో జరిగిన కొన్ని రకాల కుట్రల కారణంగా కేవలం 13 రోజులకే ప్రధానిగా రాజీనామా చేశారు.  అనంతరం 1998లో జరిగిన ఎన్నికల్లో అటల్ నేతృత్వంలోని ఎన్డిఏ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చింది.  ఆ తరువాత కేవలం 13 నెలలు మాత్రమే అధికారంలో ఉన్నది.  లోక్ సభలో ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోవాల్సి వచ్చింది.  అనంతరం 1999 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి తిరిగి విజయం సాధించింది.  అప్పటి నుంచి దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి.  ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేపట్టారు అటల్.  అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా ఎదిగేందుకు పోక్రాన్ అణు పరీక్షను నిర్వహించారు.  

అలానే దేశంలో విదేశీ పెట్టుబడులను, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించారు.  దీంతో అభివృద్ధి దిశగా ఇండియా పరుగులు తీసింది.  ఢిల్లీ నుంచి లాహోర్ కు బస్ సర్వీస్ ను కూడా అటల్ హయాంలోనే జరిగింది.  1999లో కార్గిల్ యుద్ధంలో పాక్ ను ఇండియా ఓడించి మరోసారి ఆధిపత్యం నిరూపించుకున్నది కూడా అటల్ హయాంలోనే కావడం విశేషం.  2014 వ సంవత్సరంలో తిరిగి బీజేపీ అధికారంలోకి రావడానికి అంతకు ముందు అటల్ చేసిన కృషి కారణం అని చెప్పొచ్చు.  అందుకే అటల్ పుట్టినరోజును 2014లో సుపరిపాలన దినోత్సవంగా జరపాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  దేశం కోసం వివాహం చేసుకోకుండా ఉండిపోయాడు అటల్ జీ.  అయన జీవితాన్ని దేశానికే అంకితం చేశారు.  2009లో అనారోగ్యం పాలైన అటల్... 2018 ఆగష్టు 16 వ తేదీన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.