బబితాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన గుత్తా జ్వాల

బబితాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన గుత్తా జ్వాల

కరోనా దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అవుతుంది. లక్షలాది మంది ఆసుపత్రిపాలు అవుతున్నారు. మరణాలు కూడా అదే స్థాయి లో నమోదు అవుతున్నాయి. ఇక మన దేశంలో కూడా ఈ మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తూ కలకలం రేపుతోంది. కరోనా కేసులు పెరగడానికి కారణం ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ ప్రార్థనలే కారణమని.. భారత స్టార్ రెజ్లర్ బీజేపీ నాయకురాలు బబితా ఫోగాట్ చేసిన ట్విట్టర్లో పోస్టులు పెద్ద వివాదాన్ని రేపుతున్నాయి. ఒక మతాన్ని కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయంటూ నెటిజన్లు ఆమెపై విమర్శలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమె పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే వాటి పై కూడా  బబితా ట్విట్టర్లో స్పందించింది. 'నేను ఎవరికీ భయపడను. ఈ ట్వీట్లు చేసిన తర్వాత నుంచి తనను సోషల్ మీడియాలో పలువురు బెదిరిస్తున్నారు. నేను ఏమి తప్పుగా మాట్లాడలేదు నా వ్యాఖ్యాలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా' అని బబితా స్పష్టం చేసింది.అయితే ఈ ట్వీట్లపై కూడా పెద్ద దుమారమే రేగింది. తాజాగా ఈ అంశంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల స్పందిస్తూ బబితాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. 'సారీ బబితా. ఈ కరోనా వైరస్ జాతి లేదా మతాన్ని చూస్తుందని అనుకోను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మనం స్పోర్ట్స్ పర్సనాలటీలం. మనం దేశానికే ప్రాతినిథ్యం వహిస్తున్నాం. మనం గెలిచినప్పుడు ప్రజలంతా కులాలు-మతాలు లేకుండా సెలబ్రేట్ చేసుకుంటారు. మన విజయాల్ని వారి గెలుపులుగా భావిస్తారు' అని జ్వాల పేర్కొంది.  ఏ పరిస్థితుల్లోనైనా మనల్ని భారతీయులగా మాత్రమే గుర్తించారు. ప్రతీ ఒక్కరూ నా విజయాన్ని వారి విజయంగానే చూశారు. సమైక్యతే మన బలం  దేశాన్ని విడగొట్టద్దు' అంటూ జ్వాలా ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. వివాదాస్పద ట్వీట్ తొలగించాలని గుత్తా జ్వాల కోరింది.