ఎమ్మెల్సీ రేసులో గోరటి వెంకన్న..!

ఎమ్మెల్సీ రేసులో గోరటి వెంకన్న..!

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల కోసం టీఆర్‌ఎస్‌లో ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. కానీ.. టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మదిలో ఎవరున్నారన్నది మాత్రం బయటకు రాలేదు. ఇదే సమయంలో పదవీకాలం ముగిసిన నాయిని  నరసింహారెడ్డి, కర్నె ప్రభాకర్‌లు మరోసారి అవకాశం ఇస్తారని ఎదురు చూస్తున్నారు.  మూడు ఖాళీలు ఉండటంతో ఒకటి ఓసీకి, మరొకటి బీసీకి... ఇంకొకటి ఎస్సీ లేదా ఎస్టీకి ఇవ్వాలని కేసీఆర్‌ అనుకుంటున్నారట. అయితే గతంలోలాగ అచ్చం అందరినీ రాజకీయ నేతలతో నింపేయకుండా గవర్నర్‌ కోటాకు అర్ధం.. పరమార్థం వచ్చేలా అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నారట. ఈ క్రమంలోనే  వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అవకాశం కల్పించాలని అనుకుంటున్నారట. అందుకే కవులు, కళాకారులు ఈ కేటగిరిలో ఛాన్స్‌ దక్కుతుందని అభిప్రాయపడుతున్నారు. అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చేలా పార్టీలకు అతీతంగా తెలంగాణ కోసం పనిచేసిన కవి.. కళాకారుడిని ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్‌ సంప్రదింపులు చేస్తున్నారట.

ఈ సందర్భంగా  పల్లె కన్నీరు పెడుతుందో అని తెలంగాణ ప్రజా జీవితాన్ని ప్రపంచానికి చాటిన జానపద కవి... గాయకుడు గోరటి వెంకన్న పేరు చర్చలోకి వచ్చినట్లు సమాచారం. ఆయనది పాలమూరు జిల్లా. తెలంగాణ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా ప్రజల తరఫున పోరాడిన కవిగా, గాయకుడిగా ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లకుండా తన  అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రజలకు మేలు చేసే పనులను ప్రశంసిస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేయకుండా సంయమనం పాటిస్తూ రావడం గోరటి వెంకన్నకు కలిసొచ్చిన అంశంగా చెబుతున్నారు. అందుకే వెంకన్న పేరును  సీఎం కేసీఆర్‌ సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు  దాదాపుగా కొలిక్కి వచ్చిందని.. ఒకేసారి ముగ్గురు పేర్లను ప్రకటించే వీలుందని పార్టీ వర్గాల టాక్‌. ఈ ముగ్గురిలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన గోరటి వెంకన్న పేరు ఉంటుందని అనుకుంటున్నారు. అదీకాకుండా.. పార్టీకి చెందని వ్యక్తిగా వెంకన్నకు అవకాశం ఇస్తే.. అటు ఉద్యమకారులకు.. ఇటు విమర్శకులకు సమాధానం ఇచ్చినట్లు అవుతుందని లెక్కలు వేస్తున్నారట.