కొన్ని గంటల్లోనే పేటీఎం రీ ఎంట్రీ.. అసలేం జరిగింది..?

కొన్ని గంటల్లోనే పేటీఎం రీ ఎంట్రీ.. అసలేం జరిగింది..?

గూగుల్‌ ప్లేస్టోర్‌లో పేటీఎం రీ ఎంట్రీ ఇచ్చింది.. ప్లేస్టోర్‌ నుంచి మాయమైన పేటీఎం కొద్ది గంటల్లోనే వెనక్కి వచ్చేసింది. అసలు ఏం జరిగిందంటే..  నిబంధనల ఉల్లంఘనతోనే పేటీఎంను తొలగించాల్సి వచ్చిందని చెబుతోంది గూగుల్.. ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా పేటీఎం ప్రవేశ పెట్టిన స్కీమ్‌... గ్యాంబ్లింగ్‌ అంటూ గూగుల్‌ ఈ యాప్‌ను తన ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. వెంటనే గూగుల్‌తో సంప్రదించిన పేటీఎం యాజమాన్యం... గూగుల్‌ నిబంధనల మేరకు నడుచుకుంటామని తెలిపింది. క్రికెట్‌ స్కీమ్‌ను తొలగించడంతో పాటు ఫస్ట్‌ గేమ్‌ ఈస్పోర్ట్స్‌ను కూడా ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది.

కాగా, డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎంను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి  తొలగించింది. పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్ గేమ్స్‌ కూడా తీసివేసింది. అయితే, పేటీఎం బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ యాప్స్ మాత్రం యథావిధిగా అందుబాటులో ఉంచింది. గ్యాంబ్లింగ్ నిబంధనలు ఉల్లంఘించటం వల్లనే గూగుల్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఇది వరకే పేటీఎంకు నోటీసులు జారీ చేశామని, తరచూ నిబంధనలు ఉల్లంఘించడంతో తాజాగా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. గూగుల్ నిబంధనల ప్రకారం.. ఎలాంటి జూదాలు, ఆన్లైన్ బెట్టింగులు నిర్వహించకూడదు. కానీ, పేటీఎం, పేటీఎం ఫస్ట్‌ గేమ్‌ యాప్స్ ద్వారా ఫాంటసీ క్రికెట్ సేవలను ప్రారంభించింది. ఇది జూదాన్ని ప్రోత్సహించేదిగా ఉండడంతో గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి పేటీఎంను తీసేసింది. అయితే, త్వరలోనే మళ్లీ సేవలు ప్రారంభమవుతాయని పేటీఎం చెప్పింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే గూగుల్‌ ప్లే స్టోర్‌లో పేటీఎం యాప్‌ను అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దేశంలో పేటీఎంను 5 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు.