2018 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్..నియామకాల తేదీ ఖరారు..!

2018 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్..నియామకాల తేదీ ఖరారు..!

2018 డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండేళ్లుగా వివిధకారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న నియామక ఉత్తర్వులు ఇచ్చేనందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని ఏపీ విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేసారు. కోర్టుల్లో  వివాదాల కారణంగానే పోస్టులను భర్తీ చేయలేదని తెలిపిన మంత్రి..హైకోర్టు తీర్పు వెలువడిన దరిమిలా అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.3,524 ఉపాధ్యాయ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని అన్నారు. ఇప్పటికే  2,203 మంది అభ్యర్థుల వెరిఫికేషన్ పూర్తి అయ్యిందని... మిగిలిన 1,321 మంది అభ్యర్థుల వెరిఫికేషన్ మంగళవారం సాయంత్రానికి పూర్తి చేశామన్నారు. సెప్టెంబర్ 24వ తేదీన ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించి అదేరోజున పోస్టుల ఖాళీల వివరాలను అభ్యర్థులకు తెలియజేస్తామన్నారు.సెప్టెంబర్ 25, 26 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించి, అదేరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ లు ఇస్తామని అన్నారు. ఎస్జీటీ పోస్టులు భర్తీ అయ్యాక న్యాయస్థానం ఆదేశాల ప్రకారం మిగిలిన పోస్టులు భర్తీ చేస్తామని, ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్, వ్యాయామ ఉపాధ్యాయులు, ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 28లోపు నియామక ప్రక్రియను పూర్తి చేసి అర్హులకు నియామక పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా డీఎస్సి 2020 ని కూడా నిర్వహిస్తామని ప్రకటించారు.