గ్రేటర్ వార్‌కు సిద్ధమవుతున్న పార్టీలు.. డిసెంబర్ లోనే ?

గ్రేటర్ వార్‌కు సిద్ధమవుతున్న పార్టీలు.. డిసెంబర్ లోనే ?

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయనే దానిపై పరోక్ష సంకేతాలిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్. నవంబర్‌ రెండో వారం తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్‌ రావొచ్చన్న ఆయన... ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సూచించారు. అలాగే... పనితీరు సరిగా లేని వారికి గట్టి హెచ్చరికలు కూడా చేశారాయన. మరోవైపు... కాంగ్రెస్‌, బీజేపీ కూడా గ్రేటర్‌ ఎన్నికల వ్యూహరచనలో మునిగిపోయాయి. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం షెడ్యూల్ కంటే మూడు నెలల ముందు ఎన్నికలు జరుపుకునే వెసులుబాటు ఉంది. దీనితో అధికార పార్టీ గ్రేటర్ ఎన్నికలకు ముందుగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు కూడా దీన్ని బలపరుస్తున్నాయి. 
 
నవంబర్ రెండో వారంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మంత్రి కేటీఆర్ కూడా... నవంబర్ రెండో వారం తర్వాత ఏ క్షణమైనా గ్రేటర్ ఎన్నికలు రావొచ్చని... గ్రేటర్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సమావేశంలో చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా... పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. గ్రేటర్‌ కార్పొరేటర్లలో 15 శాతం మంది కార్పొరేటర్ల పనితీరు బాగోలేదని సర్వేలో తెలిసిందన్న ఆయన... ఇప్పటికైనా అలాంటి వాళ్లు పనితీరు మార్చుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలుంటే స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలని కేటీఆర్ కార్పొరేటర్లతో చెప్పారు.  
గ్రేటర్ ఎన్నికలకు సమాయత్తం అయ్యే క్రమంలో అభ్యర్థుల ఎంపికపైనా టిఆర్ఎస్ దృష్టి పెట్టింది. గ్రేటర్లో ఉన్న సిట్టింగ్ కార్పొరేటర్లపై ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు నియోజవర్గానికి ఒక ఇన్‌ఛార్జ్‌ని పార్టీ నియమించినట్టు తెలుస్తోంది. అక్టోబర్ రెండో వారంలోపు సిట్టింగ్ కార్పొరేటర్లపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని... ఆ ఇన్‌ఛార్జ్‌లకు సూచించింది. ఫీడ్ బ్యాక్ వచ్చిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనుంది. గ్రేటర్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేని, ఒక ఎమ్మెల్సీని ఇన్‌ఛార్జ్‌గా నియమించాలనే ఆలోచనలో ఉంది.
 
ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా గ్రేటర్‌ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ సాక్షిగా గ్రేటర్ పరిధిలోని సమస్యల్ని ప్రస్తావించిన కాంగ్రెస్‌... వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. డబల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం, వర్షాల సీజన్లో ప్రజలకు ముంపు కష్టాలు, వరుసగా జరుగుతున్న ప్రమాదాలను ప్రభుత్వం వైఫల్యాలుగా భావిస్తోన్న ప్రతిపక్షం... వాటిపై ప్రజల్లో చైతన్యం తెస్తామంటోంది. ఇక బీజేపీ కూడా గ్రేటర్‌ ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టింది. గతంలో ఎదుర్కొన్న ఇబ్బదులను అధిగమించి... ప్రభుత్వ వైఫల్యాలు... కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలాంటి అంశాలను ఎన్నికల ఎజెండాగా మార్చుకోవాలని భావిస్తోంది.