మంత్రుల్లో గ్రేటర్‌ టెన్షన్‌ పట్టుకుందా...?

మంత్రుల్లో గ్రేటర్‌ టెన్షన్‌ పట్టుకుందా...?

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు GHMC పరిధిలోని మంత్రులకు పరీక్ష కాబోతున్నాయా? అందుకే తెగ టెన్షన్‌ పడుతున్నారా? ఎన్నికల ఫలితాలలో ఏమాత్రం తేడా వచ్చినా తమ పదవులకు ముప్పు పొంచి ఉందనే ఆందోళన వారిని వెన్నాడుతోందా? 

నవంబర్‌ లేదా డిసెంబర్‌లో 'గ్రేటర్‌' సమరం!

GHMC ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే  ప్రక్రియ మొదలుపెట్టింది. వచ్చే నెల లేదా డిసెంబర్‌లో గ్రేటర్‌ సమరానికి ముహూర్తం ఫిక్స్‌ అయ్యే అవకాశం ఉంది. మరోసారి సత్తా చాటాలని అధికార టీఆర్‌ఎస్‌.. పాగా వేయాలని కాంగ్రెస్‌, బీజేపీ, బలం పెంచుకోవాలని MIM.. ఇలా వ్యూహ రచనలో మునిగిపోయాయి పార్టీలు. 150 డివిజన్లు  ఉన్న GHMCలో ప్రస్తుతంలో TRSకు 99 కార్పొరేటర్లు ఉన్నారు. ఈసారి సెంచరీ కొట్టి మరింతగా దూసుకెళ్లాలని అధికార పార్టీ అన్ని వైపుల నుంచి మోహరిస్తోంది. 

మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపు బాధ్యత మంత్రులకు అప్పగించారు

ముఖ్యంగా GHMC పరిధిలో నలుగురు మంత్రులు ఉన్నారు. తలసాని శ్రీనివాసయాదవ్‌, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలకు ఈ ఎన్నికలు పెద్ద పరీక్ష కాబోతున్నాయనే టాక్‌ పార్టీ వర్గాల్లో ఉంది. ఇప్పటికే 18 నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమించి ఆరా తీస్తున్నారు గులాబీ పెద్దలు. గతంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో జిల్లాల్లో బాధ్యతంతా మంత్రులదే అని తేల్చిచెప్పారు సీఎం కేసీఆర్‌. దాంతో జిల్లాల్లోని మంత్రులు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు GHMCలోనూ అదే స్ట్రాటజీ అమలు చేస్తున్నారట. 


మంత్రుల్లో గ్రేటర్‌ టెన్షన్‌ పట్టుకుందా? 

గ్రేటర్‌లో పార్టీ పరిస్థితిపై అంతర్గతంగా సర్వేలు నిర్వహించింది టీఆర్‌ఎస్‌. ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని పార్టీ భావిస్తోంది. అయినా వీటిని ఆసామాషీగా తీసుకోవడం లేదు. టికెట్ల పంపిణీ మొదలు.. డివిజన్లలో సమస్యలు... ఇతర అంశాలపై క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరిస్తోంది. వీటిల్లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నా.. వాటిని అధిగమించి పార్టీకి సానుకూల వాతావరణం నెలకొల్పాల్సిన బాధ్యత మంత్రులపైనే ఉంటుందట. అందుకే GHMC ఎన్నికలు అనగానే మంత్రుల్లో టెన్షన్‌ మొదలైందని అంటున్నారు. 

క్షేత్రస్థాయిలో పరిస్థితుల సానుకూలతకు మంత్రుల ఫోకస్‌!

ఈ ఎన్నికల్లో ఏ మాత్రం తేడా వచ్చినా.. పార్టీ అంచనాలను అందుకోలేకపోయినా అది మంత్రుల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని అనుకుంటున్నారట. అలాంటి పరిస్థితి రాకుండా అమాత్యులు సైతం తమ బలగాలను రంగంలోకి దించి.. ఎన్నికల వ్యూహ రచనలో తలమునకలైపోయారట. ఆ మధ్య టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్‌ సమావేశం నిర్వహించారు. 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగోలేదని చెప్పారు. క్షేత్రస్థాయి సర్వే తర్వాత  చాలా మంది కార్పొరేటర్లపై జనాల్లో వ్యతిరేకత ఉన్నట్టు ఫీడ్‌ బ్యాక్‌ వచ్చిందట. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులను అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయారిటీ ఇస్తున్నారట మంత్రులు. మరి.. ఈ గ్రేటర్‌ పరీక్షలో ఎవరెన్ని మార్కులు తెచ్చుకుంటారో.. పాస్‌ అవుతారో లేదో చూడాలి.