క్రిస్ గేల్‌కు జరిమానా విధించిన ఐపీఎల్ యాజమాన్యం

క్రిస్ గేల్‌కు జరిమానా విధించిన ఐపీఎల్ యాజమాన్యం

అబుదాబి: ఐపీఎల్ యాజమాన్యం పంజాబ్ జట్టు ఆటగాడు క్రిస్ గేల్‌కు షాకిచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో 10శాతం జరిమానాగా విధించింది. పంజాబ్, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటు విసిరనందుకుగానూ అతడికి జరిమానా విధించినట్లు అంపైర్ తెలిపాడు. అయితే అలా చేయడం ఐపీఎల్ నియమాలను ఉల్లఘించడమని, అందుకే అతడికి జరిమానా వేసినట్లు తెలిపారు. అంతేకాకుండా తాను నిబంధనలను ఉల్లఘించానని గేల్ ఒప్పుకున్నాడని తెలిపారు.అబుదాబి వేదికగా పంజాబ్, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఎంతో ఉత్కంఠంగా సాగింది. అందులో నిర్ణీత 20 ఓవర్లకు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 185పరుగులు చేసింది. అయితే పంజాబ్ చేసిన 185 పరుగులలో క్రిస్ గేల్ ఒక్కడే 99పరుగులు చేయడం గమనార్హం. ఈ 41ఏళ్ల ఆటగాడు భారీ సిక్సర్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అంతేకాకుండా టీ20 సిరీస్‌లలో 1000 సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడిగా ఘనత సాధించాడు.

 ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌ను జోఫ్రా ఆర్యర్ వేశాడు. గేల్ చివరి ఓవర్ మూడో బంతిని భారీ సిక్స్‌గా మలిచి 99 పరుగులతో సెంచరీకి అతిచేరువగా నిలిచాడు. ఆర్చర్ తరువాతి బంతికే గేల్‌ను‌ క్లీన్ బౌల్డ్ చేశాడు. శతకానికి ఒక్క పరుగు దూరంలో ఔట్ అయ్యేసరికి గేల్ ఆవేశంలో బ్యాట్‌ను విసిరికొట్టాడు. అంతేకాకుండా పివిలియన్ వైపు నడుస్తూ ఆర్యర్‌ను మెచ్చుకుని, మాక్స్ వెల్ అందించిన బ్యాట్ తీసుకొని పెవిలియన్ చేరాడు. అయితే అలా బ్యాట్‌ను విసిరి కొట్టడం ఐపీఎల్ నిబంధలకు విరుద్దమని యాజమాన్యం అతడికి జరిమానా విధించింది.