గంటా శ్రీనివాస రావు రాజకీయ భవిష్యత్తు ఏంటి?
ఆయన్ని వాళ్లు రమ్మనరు.. వీళ్లు ఉండమని అనరు. అయినా నేనున్నా అంటారు. అక్కడి నుంచి ఆఫర్ ఉంది.. ఇక్కడి నుంచి పిలుపు ఉందని అప్పుడప్పుడు పిలిచి మరి లీకులు ఇస్తారు? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ?
గంటా పార్టీ మార్పుపై ఓ రేంజ్లో లీకులు!
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్ ఏంటి? ఏడాదిన్నరగా జరుగుతున్న ఈ చర్చకు ఎండ్ కార్డ్ పడటం లేదు. అనేక ముహూర్తాలు కాలగర్భంలో కలిసినా.. గంటా ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి ఇంచు కూడా కదలలేదు. మీడియాలో లీకులు మాత్రం ఓ రేంజ్లో బయటకొస్తాయి. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టు గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పుపై ఊహాగానాలు షీకారు చేస్తుంటాయి. ఆయన కూడా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీకి రారు.. రిజిస్టర్లో అటెండెన్స్ కోసం ఓ రోజు వచ్చి కనిపించి వెళ్తారు. పైగా అసెంబ్లీలో హుందాగా ఉండాలని గంటా చెప్పే సూక్తులకు కొదవే ఉండదు.
గంటాకు వైసీపీలో అంత సీన్ లేదా?
టీడీపీ అధ్యక్షుడిని గంటా కలిసి.. చూసి ఎన్నాళ్లైందో? ఆ మధ్య వైసీపీలో చేరిపోతున్నారని ఆయన వెనకున్న చిడతల బ్యాచ్ తెగ బాజాలు ఊదింది. మీడియాకు లీకులు ఇచ్చారు. సీఎంతో నేరుగా మాట్లాడేశారంటూ చెప్పుకొన్నారు. కానీ.. అక్కడ అంత సీన్ లేదు. ఇక్కడి ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ YCP ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా విశాఖ నార్త్‌లో ఏర్పాటు చేసిన ఓ సభలో కామెంట్ చేశారంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
గంటాను వైసీపీ పట్టించుకోవడం లేదా?
వైసీపీలోకి గంటా వస్తే నా పరిస్థితి ఏంటని మంత్రి అవంతి శ్రీనివాస్ నానా యాగీ చేసి పారేశారు. ఏం జరిగిందో తెలియదుకానీ గంటా వైసీపీ గృహప్రవేశం ఆగిపోయింది. అసలు గంటాను పట్టించుకోవడమే మానేశారు.
బీజేపీలోకి వెళ్తారన్న అంశంపై చడీచప్పుడు లేదు?
ఏపీ బీజేపీ చీఫ్ కాకముందు సోము వీర్రాజు విశాఖ వెళ్లి గంటాతో భేటీ అయ్యారు. దాంతో ఆయన కాషాయ కండువా కప్పుకొంటారని భావించారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఆ ప్రయత్నాలు ఉన్నాయి. కాకపోతే బీజేపీ వాళ్లు రమంటున్నారని ఆయన శిబిరం నుంచి లీకులు వస్తుంటాయి. బీజేపీకి ఇప్పుడు కాపుల బలం కావాలి. కాబట్టి తన అవసరం వాళ్లకు ఉంది. అందుకే రమ్మంటున్నారని సారే మళ్లీ సొంత బ్యాచ్‌తో లీకులు ఇప్పించారని టాక్. ఈ ఎపిసోడ్ కొన్నాళ్లు చర్చలో ఉన్నా.. ఇప్పుడు చడీ చప్పుడు లేదు.
వైసీపీ, బీజేపీ హోరులో గంటా ఉనికి మాయం?
అటు వాళ్లూ.. ఇటు వీళ్లూ గంటాను పట్టించుకోవడం లేదని అందరికీ తెలిసిపోయింది. దీంతో మళ్లీ లీకులు మొదలయ్యాయి. తాను టీడీపీలోనే ఉన్నాను.. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఆ లీకుల సారాంశం. విశాఖలో వైసీపీ, బీజేపీ హోరులో అక్కడ గంటా ఉనికి పూర్తిగా మాయమైపోయిందని.. ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే నేనున్నాను. నాకు అక్కడ డిమాండ్ ఉంది. ఇక్కడ డిమాండ్ ఉంది. వాళ్లు రమ్మంటున్నారు. వీళ్లు రమ్మంటున్నారు అని లీకులు ఇస్తున్నారని లోకల్ లీడర్స్ చెవులు కొరుక్కుంటున్నారు. అసలు వాళ్లూ వీళ్లు ఎవరూ ఇప్పుడు గంటా గురించి ఆలోచించే పరిస్థితి లేదని.. ఉనికి కోసం ఆయన మాత్రమే తాపత్రయ పడుతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)