మంత్రికి అధికారికి మధ్య నలిగిపోతున్న ఉద్యోగులు..

మంత్రికి అధికారికి మధ్య నలిగిపోతున్న ఉద్యోగులు..

ఆ శాఖలో ఇద్దరు వ్యక్తుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. శాఖకు సంబంధించిన సమీక్ష సమావేశాలకు ఒకరు హాజరైతే మరొకరు గైర్హాజరు అవుతారు. ఈ పోరులో ఉద్యోగులు నలిగిపోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇంతకు ఎవరా ఇద్దరు? ఏంటా శాఖ?

మంత్రి గంగుల వర్సెస్‌ సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌  మారెడ్డి!

తెలంగాణ పౌరసరఫరాల శాఖలో పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా తయారైందట. మంత్రి గంగుల కమలాకర్, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి మధ్య పోసగడం లేదనే ప్రచారం జరుగుతోంది. సిద్ధిపేటకు చెందిన మారెడ్డి శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరుంది. ఆయన 2019 జనవరిలో సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. కేబినెట్‌ విస్తరణలో చోటు సంపాదించిన గంగుల కమలాకర్‌కు పౌరసరఫరాల శాఖ అప్పగించారు. మంత్రిగా గంగుల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇద్దరి మధ్య పొసగడం లేదని ఉద్యోగుల టాక్‌.

మంత్రి సమీక్షలకు సిబ్బంది ద్వారా మారెడ్డికి ఆహ్వానం!

లాక్‌డౌన్‌లో ప్రజలకు ఉచితంగా బియ్యం, నగదు పంపిణీపై ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం  ప్రారంభానికి  మంత్రి గంగుల, చైర్మన్‌ మారెడ్డి కలిసి సమీక్షించి లేదు. ఆ తర్వాత ధాన్యం కొనుగోళ్లు, గన్నీ బ్యాగుల కొరత, రైస్‌ మిల్లర్లతో వస్తోన్న ఇబ్బందులు,  పంటల కొనుగోళ్లపై తలెత్తిన సమస్యల మీద మంత్రి గంగుల సమీక్ష చేశారు. ఈ సమీక్షా సమావేశాల్లో వేటికీ  సివిల్‌ సప్లయి కార్పొరేషన్‌ చైర్మన్‌ హోదాలో మారెడ్డి హాజరు కాలేదు. ఈ రివ్యూ మీటింగ్స్‌కు  ఉన్నతాధికారులతోపాటు కార్పొరేషన్‌ చైర్మన్‌ హాజరు కావాలని మంత్రి వ్యక్తిగత సిబ్బంది సమాచారం ఇవ్వడం మారెడ్డికి  రుచించలేదని అంటారు. నేనూ ఓ హోదాలో ఉన్నారు. సీఎం నిర్వహించే సమావేశాలకు కూడా నన్ను ఒక్కడినే పిలుస్తారు. అలాంటి తనను సమీక్షలకు పీఏలతో సమాచారం పంపిస్తారా అని పలు సందర్భాలలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

గంగుల వెళ్లిన సమయంలో మారెడ్డి ఛాంబర్‌లో లేరా?

ఇటీవల ఓ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి గంగుల సోమాజీగూడలోని సివిల్ సప్లయ్‌ భవన్‌కు వెళ్లారు. ఆ భవనంలోనే కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి కార్యాలయం ఉంది.  సమీక్ష సందర్భంగా మారెడ్డి కార్యాలయానికి మంత్రి వెళ్లారు. ఆ సమయంలో చైర్మన్‌ అక్కడ లేరు. ఆయన మరో కార్యక్రమంలో ఉన్నారట. దీంతో నొచ్చుకుంటూనే మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారట. అయితే  సివిల్‌ సప్లయి భవనానికి వస్తున్నట్లు మంత్రి గంగుల నేరుగా తనకు చెబితే అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని.. ఆయనకు స్వాగతం పలికేవాడినని అనుచరుల దగ్గర మారెడ్డి అన్నట్లు సమాచారం.

ఛైర్మన్‌ అవునంటే.. మంత్రి కాదంటారా?

ఇదే కాదు.. లాక్‌డౌన్‌లో వరుసగా 3 నెలలపాటు రేషన్‌ సరుకులు తీసుకోని వారికి ప్రభుత్వం 1500 నగదు ఇవ్వడం నిలిపివేసింది. ఈ విషయంలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంలోనూ మంత్రి, కార్పొరేషన్‌ చైర్మన్‌ మధ్య అభిప్రాయభేదాలు వచ్చినట్లు చెవులు కొరుక్కుంటున్నారు. చైర్మన్‌ అవునంటే.. మంత్రి కాదని చెప్పే పరిస్థితి ఉందట. దీంతో ఈ ఇద్దరు నేతల మధ్య సిబ్బంది నలిగిపోతున్నట్లు టాక్‌. పార్టీ పెద్దల దృష్టికి కూడా ఈ సమస్య వెళ్లినట్లు సమాచారం. మరి.. వారు ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదురుస్తారో లేదో చూడాలి.