వైరల్: బాబు, లోకేష్ నామినేషన్లలో పొరపాట్లు

వైరల్: బాబు, లోకేష్ నామినేషన్లలో పొరపాట్లు

టీడీపీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ నిన్న తమ ఎన్నికల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు వారు సమర్పించిన నామినేషన్ పత్రాలలో దొర్లిన తప్పులు శనివారం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడంతో టీడీపీ నేతలు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 

చంద్రబాబు ఆయన సొంత జిల్లా చిత్తూరులోని కుప్పం అసెంబ్లీ సీటుకి నామినేషన్ వేయగా లోకేష్ రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి స్థానానికి పత్రాలు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి నామినేషన్ పత్రాలలోని ఒక అనుబంధ పత్రంలో ఖర్జూర నాయుడుని చంద్రబాబు తండ్రికి బదులు భర్తగా పేర్కొన్నారు. అదే తప్పు లోకేష్ పత్రాలలోనూ చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు ఆయన భర్తగా రాశారు.

ఓటర్ల జాబితాలో అభ్యర్థి ఎక్కడైతే ఓటర్ గా నమోదయ్యాడో ఆ ఓటర్ జాబితాలోని పత్రాన్ని నామినేషన్ కి అనుబంధంగా సమర్పించాల్సి ఉంటుంది. సరిగ్గా ఇదే పత్రంలోనే దారుణమైన పొరపాటు చోటు చేసుకుంది. 'నిజానికి ఈ పత్రం సంబంధిత ఎన్నికల నమోదు అధికారి జారీ చేశారు. అతనే పొరపాటు చేశారని' ఓ సీనియర్ టీడీపీ నేత తెలిపారు. ఈ పత్రాన్ని మార్చి 19న జారీ చేయగా మార్చి 22న నామినేషన్ దాఖలు చేశారు. ఈ మూడు రోజుల్లో ఇంత పెద్ద పొరపాటును ఎవరూ గుర్తించలేదు. దీంతో అదే కాపీని చంద్రబాబు, లోకేష్ ల ఎన్నికల అఫిడవిట్ లకు జత పరిచారు.