కేసీఆర్ పై నాడు విమర్శలు, నేడు పొగడ్తలు..కారణం ఏంటి..?

కేసీఆర్ పై నాడు విమర్శలు, నేడు పొగడ్తలు..కారణం ఏంటి..?

ప్రజా యుద్ధనౌక గద్దర్‌ గళం సవరించారా? సీఎం కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపించడానికి కారణం ఏంటి? GHMC ఎన్నికల వేళ గద్దర్‌ నోటి నుంచి వచ్చిన మాటలపై ఎలాంటి చర్చ జరుగుతోంది? 

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గద్దర్‌ ప్రశంసల జల్లు!

GHMC ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉన్న సమయంలో ప్రజాగాయకుడు గద్దర్‌ ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటాపురం డివిజన్‌ ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌.. ఆ డివిజన్‌ పరిధిలోనే నివాసం ఉంటోన్న గద్దర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు  కేసీఆర్‌ చేసిన దీక్షను గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ ఫెడరల్‌ ఫ్రంట్‌ పెట్టినట్టు అయితే.. దానికి అనుబంధంగా కల్చరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి  ఆయనతో కలిసి ముందుకు సాగుతానని చెప్పారు గద్దర్‌. అక్కడితో ఆగకుండా ముఖ్యమంత్రిపై ప్రశంసల జల్లు కురిపించడం రాజకీయ చర్చకు దారితీసింది. 

అప్పట్లో కేసీఆర్‌పై గద్దర్‌ విమర్శలు!

సీఎం కేసీఆర్‌ను పాలనా దక్షునిగా కొనియాడారు గద్దర్‌. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సగభాగం సస్యశ్యామలంగా మారిందని.. రైతులు, ప్రజలు సంతోషిస్తున్నారని ప్రశంసించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో భేటీ సమయంలోనే  సీఎం కేసీఆర్‌తో దాదాపు అరగంటపాటు గద్దర్‌ ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. అయితే  ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌పై ఇదే గద్దర్‌ చేసిన విమర్శలను మరికొందరు గుర్తు చేస్తున్నారు. దొరల తెలంగాణ కాదు.. దళితుల తెలంగాణ కావాలని నాడు గళమెత్తారు గద్దర్‌. ఫామ్‌ హౌజ్‌లో కూర్చుని పాలన సాగించడం ఎక్కడా చూడలేదని ఆరోపణలు చేశారు. అలాంటి ప్రజాయుద్ధ నౌక ఇప్పటికప్పుడు ఎందుకు గళం సవరించారో అని చర్చ జరుగుతోంది. గవర్నర్‌ కోటాలో కవి గోరటి వెంకన్నను ఎమ్మెల్సీని చేయడంతో గద్దర్‌ మనసు ఏమైనా మారిందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట.

గతంలో ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీతో భేటీ!

ముందస్తు ఎన్నికల సమయంలో  గద్దర్‌ కుమారుడు రాజకీయాల్లోకి వచ్చారు. కుమారుడికి టికెట్‌ కోసం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అయితే కుమారుడి టికెట్‌ కోసం మాట్లాడలేదని.. తెలంగాణ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పేందుకే వెళ్లినట్టు తెలిపారు గద్దర్‌. మరి.. ఇప్పుడేమైనా కొడుకు రాజకీయ భవిష్యత్‌ కోసం గళం సవరించారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయట. 

ఉద్యమ సమయంలో ప్రజాఫ్రంట్‌ ఏర్పాటు చేసి తప్పుకొన్నారు!

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్‌ కోదండరాం ఐక్యకార్యాచరణ  కమిటీ చైర్మన్‌గా ఉంటే.. ఆయనకు పోటీగా విమలక్క, కూర రాజన్న మరికొందరితో కలిసి ప్రజా ఫ్రంట్‌ వేదిక ఏర్పాటు చేశారు గద్దర్‌. కొన్నాళ్లు ఆ వేదికపై ఉద్యమాలు చేసినా.. తర్వాత తప్పుకొని వేరొకరికి బాధ్యతలు అప్పగించారు. ఇలా జీవితమంతా పోరాటాలకు అంకితం చేసిన గద్దర్‌ ఒక్కసారిగా మరో టర్న్‌ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచిందట. మరి.. గద్దర్‌ ఇదే వైఖరిపై ఉంటారో.. మళ్లీ మనసు మార్చుకుంటారో చూడాలి.