రివ్యూ: గద్దలకొండ గణేష్ 

రివ్యూ: గద్దలకొండ గణేష్ 

నటీనటులు: వరుణ్ తేజ్, అధర్వ మురళి, పూజా హెగ్డే, మృణాళిని రవి తదితరులు 

మ్యూజిక్: మిక్కీ జె మేయర్ 

సినిమాటోగ్రఫీ : అయినంక బోస్ 

నిర్మాతలు: రామ్ ఆచంట, గోపినాథ్ ఆచంట 

దర్శకత్వం: హరీష్ శంకర్ 

ముకుంద, కంచె, అంతరిక్షం, ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2 ఇలా వరసగా సాఫ్ట్ పాత్రలుండే సినిమాల్లో నటిస్తూ వస్తున్న వరుణ్ తేజ్ మొదటిసారిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్టైనర్ గద్దలకొండ గణేష్ సినిమాలో నటించారు.  ఒక గ్యాంగ్ స్టర్ గా ఉండే వరుణ్ ఎలా మంచి వాడుగా మారాడు అన్నది కథ.  కథ ప్రకారం మొదట వాల్మీకి అని టైటిల్ పెట్టినా కొన్ని కారణాల వలన సినిమా టైటిల్ మార్చాల్సి వచ్చింది.  పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ వంటి బెస్ట్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్.. వరుణ్ తేజ్ తో చేసిన ఈ గద్దలకొండ గణేష్ ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం.  

కథ: 

అధర్వ మురళి ఓ దర్శకుడు.  అందరిలా కాకుండా కొత్త సబ్జెక్టుతో సినిమా చేయాలని అనుకున్నాడు. ఫేడ్ ఔట్ అయిన గ్యాంగ్ స్టర్ తో కాకుండా ప్రస్తుతం దందాలో ఉన్న గ్యాంగ్ స్టర్ కథను బేస్ చేసుకొని సినిమా చేయాలని అనుకోని.. అలాంటి వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్తాడు మురళి.  మురళికి గద్దలకొండ గణేష్ కనిపిస్తాడు.  గణేష్ తో పరిచయం పెంచుకొని అయన కథ తెలుసుకొని ఆ కథ ఆధారంగా సినిమా చేయాలని అనుకుంటే.. గద్దలకొండ గణేష్ మురళికి ట్విస్ట్ ఇచ్చి.. ఆ సినిమాలో తానే హీరోగా ఉంటానని చెప్పడంతో షాక్ అవుతాడు.  గణేష్ నుంచి తప్పించుకోలేని పరిస్థితి.. సినిమా చేయకుండా వెళ్లలేని వైనం.. దీనిమధ్య మురళి గణేష్ తో సినిమా చేశాడా ? లేదా.? గ్యాంగ్ స్టర్ గణేష్ మంచివాడిగా ఎలా మారాడు..? పూజా హెగ్డే పాత్ర ఏంటి? అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

పుట్టుకతోనే ఏ వ్యక్తి చెడ్డగాడుగా ఉండాలని కోరుకోదు.. పరిస్థితులే అతన్ని చెడ్డగాడుగా మారుస్తాయి.  చెడ్డవాడుగా ఉన్న వ్యక్తి ఎప్పటికి చెడ్డగాడుగా ఉంటాడని గ్యారెంటీ లేదు.  పరిస్థితుల్లో మార్పులు వచ్చినపుడు అతనిలో మార్పులు వస్తాయి. మంచి వ్యక్తిగా మారిపోతాడు.  అందుకో చాలా ఉదాహరణలు ఉన్నాయి.  వేటను జీవనాధారంగా జీవించిన బోయవాడు.. అనుకోకుండా జరిగిన ఓ సంఘటనతో వాల్మీకిగా మారిపోతారు.  రామాయణం వంటి మహా కావ్యాన్ని రచించాడు.  మొదటి ఈ సినిమాకు వాల్మీకి అని పెట్టినా కొన్ని కారణాల వలన టైటిల్ చేంజ్ చేయాల్సి వచ్చింది.  అది వేరే విషయం అనుకోండి.  

సినిమాకు మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు హరీష్ శంకర్. మాస్ ను మెప్పించే కాన్సెప్ట్.. దానికోసం వరుణ్ తేజ్ వంటి ఒక సాఫ్ట్ క్యారెక్టర్ ఉన్న హీరోను తీసుకొని గెటప్, మేకోవర్, యాక్టింగ్ స్టైల్, డైలాగ్స్ అన్నింటిని మార్చేశారు.  ఇది పెద్దసాహసమే అని చెప్పాలి.  సినిమాకు హైప్ రావడానికి ఇది మెయిన్ పాయింట్ అయ్యింది.  హీరో పాత్ర హైలైట్ కావాలంటే.. అందులో ఉండే విలన్.. ఇతర నటీనటుల పాత్రల్లో వెయిట్ ఉండాలి. ఎమోషన్స్ ఉండాలి.  అప్పుడు హీరో పాత్ర హైలైట్ అవుతుంది.  ఇందులో వరుణ్ తేజ్ చుట్టూనే కథను నడిపించారు.  

హీరో అతనే... విలను అతనే.  ఇది సినిమాకు మైనస్ గా మారింది.  ఫస్ట్ హాఫ్ మొత్తం వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా చూపించారు.  మాస్ ను మెప్పించేందుకు ప్రయత్నం చేశాడు.  సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలౌతుంది.  ఎమోషన్స్, ఫ్యాష్ బ్యాక్ ఇలా కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి.  ఎపిసోడ్స్ పరంగా చూసుకుంటే సినిమా బాగుంది.  కానీ, నిడివి బాగా ఎక్కువ కావడం ప్రేక్షకులను కొద్దిగా ఇబ్బంది పెట్టింది.  

నటీనటుల పనితీరు: 

గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ జీవించాడు.  తక్కువ సమయంలో అలాంటి పాత్ర రావడం వరుణ్ అదృష్టంగా చెప్పాలి.  నటన, లుక్స్, మేనరిజం, డైలాగ్స్ అన్ని మెప్పించాయి.  సినిమాను భుజంపై వేసుకొని నడిపించాడు.  ఇక మరో హీరో అధర్వ మురళి తన పాత్రకు న్యాయం చేశాడు.  అతిధి పాత్రలో నటించిన పూజా హెగ్డే చాలా బాగుంది.  శ్రీదేవి పాత్రకు న్యాయం చేసింది.  తన లుక్స్ తో ఆకట్టుకుంది.  మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు.  

సాంకేతికవర్గం పనితీరు: 

తమిళంలో జిగర్తాండ సినిమాను రీమేక్ అయినా... ఆ సినిమాకు చాలా మార్పులు చేశారు.  తమిళంలో బాబీ చేసిన గ్యాంగ్ స్టర్ రోల్ కు మార్పులు చేసి మాస్ ను మెప్పించే విధంగా తయారు చేయడంలో దర్శకుడు హరీష్ శంకర్ విజయం సాధించాడు.  మేకింగ్, టేకింగ్ అంతా బాగున్నాయి.  కాకపోతే లెంగ్త్ ఎక్కువైంది.  సినిమా లెంగ్త్ తగ్గించినట్టైతే మరోలా ఉండేది.  సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రాణం పోశాడు మిక్కీ జె మేయర్.  సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.  ఫ్లాష్ బ్యాక్ వింటేజ్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంది.  14 రీల్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి 

పాజిటివ్ పాయింట్స్: 

నటీనటులు 

కథ 

మ్యూజిక్ 

సినిమాటోగ్రఫీ 

మైనస్ పాయింట్స్: 

లెంగ్త్ ఎక్కువ 

బలమైన ఎమోషన్స్ లేకపోవడం 

చివరిగా:  గద్దలకొండ గణేష్ - మాస్ ను మెప్పించాడు.