నిలబడే పరిస్థితుల్లో లేకుండా 161 బంతులు ఎదుర్కొన్న విహారి...

నిలబడే పరిస్థితుల్లో లేకుండా 161 బంతులు ఎదుర్కొన్న విహారి...

ఒక్క ఇన్నింగ్స్‌. ఒకే ఒక్క ఇన్నింగ్స్... అతని సత్తా ఏంటో బయటపెట్టింది. అదేదో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ కాదు. పరుగుల వరద పారించిన ఇన్నింగ్స్‌ అంతకన్నా కాదు. కానీ... అది జట్టును ఓటమిని గట్టెక్కించింది. మ్యాచ్‌ డ్రా అయినా... గెలిచినంత సంబరాన్ని కలిగించింది. అదే... సిడ్నీ టెస్టు ఛేజింగ్‌లో హనుమ విహారి ఆడిన ఇన్నింగ్స్‌. అతని ఆటతీరుకు ఇప్పుడు క్రీడాభిమానులంతా బ్రహ్మరథం పడుతున్నారు. మాజీలు హనుమ ఆటను ఆకాశానికెత్తేస్తున్నారు. తొడ కండరాలు పట్టేసి నిలబడటానికి కూడా కష్టంగా ఉన్న సమయంలో... మొక్కవోని దీక్షతో పట్టుదలగా ఆడి... అందర్నీ ఫిదా చేశాడు... హనుమవిహారి.

తొడ కండరాల గాయంతో సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నా... జట్టును ఓటమి నుంచి కాపాడాలనే కసి ముందు... హనుమవిహారి గాయం చిన్నదైపోయింది. ఓవైపు గాయం.. ఆపై శరీరంపై బలంగా తాకుతున్న బంతులు.. సమయం గడుస్తున్న కొద్దీ తీవ్రమవుతున్న ఇబ్బందులు.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో హనుమవిహారి గొప్ప పోరాట పటిమ ప్రదర్శించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లు ఉన్న ఆసీస్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఓటమిని తప్పించి.. జట్టును గట్టెక్కించాడు. 

ఆస్ట్రేలియా పర్యటనలో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌ ముందువరకూ హనుమవిహారి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. తొలి రెండు టెస్టుల్లో... బ్యాటింగ్‌ చేసిన మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ వరుసగా 16, 8, 21 పరుగులు మాత్రమే చేశాడు. పైగా క్రీజులోకి వచ్చిన కొద్దిసేపటికే అతని తొడ కండరాలు పట్టేశాయి. అతను క్రీజులో నిలవగలడా? ఒకవేళ ఆడినా ప్రస్తుత ఫామ్‌ ప్రకారం జట్టును కాపాడగలడా? అనే అనుమానాలు కలిగాయి. ఇన్ని సవాళ్ల మధ్య హనుమవిహారి అద్భుతంగా ఆడాడు. పరుగులు తీయడం కష్టమైనా... క్రీజులో పాతుకుపోయి ఓవర్లను కరిగిస్తూ వెళ్లాడు. 

వికెట్లు పడకపోవడంతో హనుమవిహారితో పాటు అశ్విన్‌నూ మాటలతో కవ్వించారు... ఆసీస్‌ ఆటగాళ్లు. ఏకాగ్రత దెబ్బతీయాలని చూశారు. షార్ట్‌పిచ్‌ బంతులతో భయపెట్టారు. కానీ ప్రత్యర్థి ప్రయత్నాలన్నింటినీ హనుమవిహారి చిత్తు చేశాడు. ఓపిక వీడకుండా.. ఏకాగ్రత చెదరకుండా.. ప్రత్యర్థి విసిరిన కఠిన సవాళ్లను తిప్పికొట్టారు. విహారి చేసింది 23 పరుగులే అయినా... అతను ఎదుర్కొన్న 161 బంతులు ఆటగాడిగా తన సామర్థ్యం ఏంటో చాటుతున్నాయి. తొడ కండరాల గాయంతో తీవ్రంగా బాధపడిన హానుమవిహారి... దాదాపుగా ఒంటి కాలిపైనే తన పోరాటం సాగించాడు. నిలబడడానికి కష్టమైన స్థితిలో అన్ని బంతులు ఎదుర్కొన్నాడు కాబట్టి... తక్కువ పరుగులు చేసినా... తన ఇన్నింగ్స్‌ టెస్టు సెంచరీ కంటే గొప్పదని రహానెతో సహా ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తున్నారు.

హనుమ విహారి పట్టుదల, ఏకాగ్రతకు ఎంతో మంది ఫిదా అయ్యారు. కామెంటేటర్ హర్షా బోగ్లే అయితే తెగ సంబరపడిపోయాడు. ఎంతలా అంటే.. హనుమవిహారి తల్లి విజయలక్ష్మికి తన ఆనందాన్ని ట్వీట్‌ రూపంలో తెలియజేసారు. విజయలక్ష్మి గారూ.. మీ అబ్బాయి చాలా బాగా అడుతున్నాడు అని ట్వీట్ చేశాడు... హర్షా భోగ్లే. మ్యాచ్ జరుగుతున్న సమయంలో హనుమ విహారి డిఫెన్స్‌పై ఓ నెటిజన్ నెగటివ్‌గా కామెంట్ చేస్తే... అతని తొడ కండరాలకు గాయమైన విషయాన్ని గుర్తు చేసి.. టీమిండియా కోసం ధైర్యంగా మ్యాచ్ ఆడుతున్నాడంటూ కౌంటర్‌ ఇచ్చాడు.