తెలంగాణలో వైసీపీ నేతల పరిస్థితి ఏంటి...?

తెలంగాణలో వైసీపీ నేతల పరిస్థితి ఏంటి...?

తెలంగాణలో ఆ పార్టీ ఉనికే లేదు. కానీ ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం ఉన్నారు. మిగతా నాయకులు ఉన్నారో లేదో తెలియదు. ఇప్పుడు కొత్తగా మరోపార్టీ పుట్టుకొస్తున్న తరుణంలో వారి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. ఆ పార్టీ ఏంటో.. ఆ కథేంటో ఈ స్టోరీలో చూద్దాం...

డైలమాలో తెలంగాణ వైసీపీ కేడర్‌?

తెలంగాణలోని YCP కార్యకర్తలు అయోమయంలో  పడ్డారా? ఇంతకీ ఆ పార్టీకి తెలంగాణలో కేడర్‌ ఉందా?  తెలంగాణలో వైసీపీ కొనసాగింపుపై పార్టీ అధినేత ఏమనుకుంటున్నారో ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల స్పష్టం చేసేశారు. దీంతో ఇవాళ కాకపోయినా రేపైనా తెలంగాణలో వైసీపీ కార్యకలాపాలు మొదలవుతాయని ఆశించిన వారు డైలమాలో పడ్డారట. ఇదే సమయంలో YS షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధం కానుండటంతో అటు వెళ్లాలా లేదా అని ఊగిసలాటలో ఉన్నారట. 

తెలంగాణలో వైసీపీ కార్యకలాపాలు లేవు!

2014 ఎన్నికల్లో వైసీపీ తెలంగాణలోనూ పోటీ చేసినా.. కేవలం ఖమ్మంలోనే ఒక ఎంపీ.. ముగ్గురు ఎమ్మెల్యేలను గెలుచుకుంది. తర్వాతి రోజుల్లో వారంతా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో వైసీపీ పోటీ చేయలేదు. కానీ.. ఆ పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి రెండు దఫాలుగా కొనసాగుతున్నారు. సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ ఇక్కడ పోటీ చేయలేదు. పార్టీ చేపట్టిన కార్యక్రమాలూ లేవు. ఏం చేయాలన్నా పార్టీ పెద్దల అనుమతి తప్పనిసరి. పైగా తెలంగాణ సర్కార్‌కు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు.. కార్యక్రమాలు ఉండకూడదనే ఆదేశాలు ఉన్నాయట. దీంతో అంతా సైలెంట్‌ అయిపోయారు. 

ఒకప్పుడు యాక్టివ్‌గా ఉన్న నేతలు వెళ్లిపోయారు? 

తెలంగాణలోని వైఎస్‌ అభిమానులే లక్ష్యంగా షర్మిల అండ్‌ టీమ్‌ పావులు కదుపుతోంది. చాలా మంది నాయకులకు ఫోన్లు కూడా వెళ్లాయి. దాంతో తెలంగాణలో ఉనికిలో లేని వైసీపీలో ఉండాలా లేక షర్మిల వెంట వెళ్లాలా అని ఆలోచనలో పడ్డారట కేడర్‌. ఇప్పుడున్న రాజకీయ పరిణామాలలో ఎవరైనా పెద్ద నాయకులు షర్మిల శిబిరంలో చేరితే.. ఒక నిర్ణయానికి వద్దామని కొందరు వేచి చూస్తున్నారట. వైసీపీ ప్రారంభించిన కొత్తలో తెలంగాణలో యాక్టివ్‌గా ఉన్నవారంతా తర్వాతికాలంలో ఎవరిదారి వారు చూసుకున్నారు. వైఎస్‌పైనా, జగన్‌పైనా అభిమానంతో కొందరు కార్యకర్తలు, అనుచరులు మాత్రం అలాగే ఉండిపోయారు. ఇలాంటి వారి సంఖ్య ఎంత ఉంటుంది అన్నది తెలియాల్సి ఉంది.  మరీ ముఖ్యంగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఏ గట్టున ఉంటారన్నది కూడా ఆసక్తిగా మారింది.