కమిషనర్‌ బదిలీ వెనక మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌?

కమిషనర్‌ బదిలీ వెనక మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌?

పదవి లేకపోయినా చేతిలో పవర్‌ ఉండాలని ఆ మాజీ ఎమ్మెల్యే పావులు కదుపుతున్నారా? మున్సిపల్‌ కమిషనర్‌పై ఆయన పొలిటికల్‌ అటాక్‌ అందులో భాగమేనా? తమవారి జోలికి వెళ్లి కొరివితో తలగోక్కోవద్దనే హెచ్చరికలు పంపారా? 

కమిషనర్‌ బదిలీ వెనక మాజీ ఎమ్మెల్యే?

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్‌ కమిషనర్‌ బదిలీ రాజకీయ దుమారం రేపుతోంది. కమిషనర్‌గా స్పందన బాధ్యతలు చేపట్టిన 9 నెలలకే బదిలీ జరగడం ఒక చర్చ అయితే.. దాని వెనక జరిగిన పరిణామాలు అధికార పార్టీలో ఆసక్తి రేపుతున్నాయి. ఇక్కడ పట్టు నిలుపుకొనేందుకు మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నేత చింతా ప్రభాకర్‌ కమిషనర్‌ బదిలీ వెనక ఉన్నారన్న ప్రచారం ఈ అంశాన్ని మరింత వేడెక్కిస్తోంది. 

అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు పట్టించుకోని కమిషనర్‌!

కమిషనర్‌గా స్పందన వచ్చిన తర్వాత సదాశివపేటలో అక్రమ నిర్మాణాలు, అనుమతి లేని కట్టడాలపై కొరడా ఝుళిపించారు. అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిళ్లు వచ్చినా ఆమె పట్టించుకోలేదట. సదాశివపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఒక మహిళ ఉన్నారు. వైస్‌చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ సోదరుడు గోపాల్‌ కొనసాగుతున్నారు. ఇక్కడ పెత్తనం అంతా గోపాల్‌దే. మున్సిపాలిటీలో తన మాటే నెగ్గాలన్నది వైస్‌ చైర్మన్‌ పంతంగా చెబుతారు పార్టీ కార్యకర్తలు. అందుకే అక్రమ నిర్మాణాల విషయంలో పలుమార్లు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలోనే కమిషనర్‌కు, గోపాల్‌కు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. 

రాజకీయంగా రాంగ్‌ సిగ్నల్స్‌ వెళ్తాయని చింతా భావించారా? 

చివరకు సమస్య మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ చెంతకు చేరిందట. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్ధి జగ్గారెడ్డి చేతిలో ఓడిపోయారు. అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు సదాశివపేట మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేశారు ప్రభాకర్‌. టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నా.. ఇక్కడ తన చేతిలో పవర్‌ లేదని ప్రచారం జరిగితే పరువు పోతుందని భావించారో ఏమో.. కమిషనర్‌ను బదిలీ చేయించే వరకు ప్రభాకర్‌ నిద్రపోలేదని అనుకుంటున్నారు. స్పందనను ఆందోల్‌ జోగిపేట మున్సిపాలిటీకి బదిలీ చేయించారు. సొంత మున్సిపాలిటీపై పట్టుకోల్పోతే రాజకీయంగా రాంగ్‌ సిగ్నల్స్‌ వెళ్తాయని ఆయన భావించారట. తాము చెప్పినట్టు నడుచుకోవాలని లేదంటే రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయని కూడా కమిషనర్‌ను సుతిమెత్తంగా హెచ్చరించారని కూడా పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అయితే పని విషయంలో ముక్కుసూటిగా ఉంటే కమిషనర్‌ స్పందన మాజీ ఎమ్మెల్యే చెప్పినదానికి నో అన్నారట. 

ప్రభుత్వ ఉద్యోగులు వచ్చామా.. వెళ్లామా అన్నట్టే ఉండాలా?

ఈ ఘటన తర్వాత చింతా ప్రభాకర్‌ టోన్‌ పెరిగినట్టు లోకల్‌గా వినిపిస్తున్న మాట. అధికారులు అధికార పార్టీతో సఖ్యతగా ఉండాలని హెచ్చరిస్తున్నారట. పదవిలో ఉన్నా లేకపోయినా పెత్తనం తమదే అని ఆయన స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. GHMC ఎన్నికలకు ముందు తమ సామాజికవర్గానికి MLC ఇస్తానని సీఎం చెప్పారని.. అది తనకే వస్తుందని అనుచరులకు చెబుతున్నారట ప్రభాకర్‌. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా.. వచ్చామా.. పని చూసుకున్నామా.. వెళ్లామా అన్నట్టు ఉండాలని స్పష్టం చేస్తున్నారట. అంతేకాదు..కమిషనర్‌ స్పందన బదిలీ కాగానే గతంలో ఆమె సీజ్‌ చేసిన దుకాణాలు  24 గంటల్లోనే తెరుచుకున్నాయి. అక్రమ కట్టడాల కూల్చివేతలు ఆగిపోయాయి. ప్రస్తుతం ఈ అంశం సంగారెడ్డి జిల్లా రాజకీయ వేడి రగిలిస్తోంది. కమిషనర్‌ స్పందన మాత్రం కొత్త ప్లేస్‌లో చేరకుండా సెలవులో వెళ్లిపోయారట. నిజాయితీగా పనిచేస్తే తనను అన్యాయంగా బదిలీ చేశారని వాపోతున్నారట. మరి.. ఈ ట్రాన్స్‌ఫర్ పాలిటిక్స్‌ ఇంకా ఎలాంటి మలుపు తీసుకుంటాయో చూడాలి.