పాలమూరు జిల్లా దేవరకద్రలో వేడెక్కిన రాజకీయం!
ఎన్నికలకు ఇంకెంతో దూరం లేదన్నట్టుగా దేవరకద్రలో సందడి మొదలైంది. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అధికార విపక్ష పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ఈ రేస్ కారణంగా కొత్త ఈక్వేషన్లు తెరపైకి వస్తాయన్న చర్చ ఊపందుకుంది. మరి.. అంతా అనుకున్నట్టుగా అక్కడి రాజకీయా పరిణామాలు మారతాయా?
కారు నిండినా టాప్‌పై కూర్చోబెడతామంటోన్న టీఆర్ఎస్!
పాలమూరు జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం రాజకీయం వేడెక్కుతోంది. రేపో మాపో ఎన్నికలున్నాయన్నట్టు ఈక్వేషన్స్ మారుతున్నాయి. కారు నిండినా టాప్‌పై కూర్చోబెట్టుకుంటాం అన్నట్లు పార్టిలోకి కొత్తవారిని చేర్చుకుంటోంది టీఆర్ఎస్. పాత, కొత్త నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఆ పార్టీ నేతలు. అభివృద్ధి కోసం కలిసొచ్చే అందరికి గులాబీ కండువాలు కప్పేస్తామంటున్నారు అక్కడి నాయకులు. ఈ సందర్భంగా విపక్ష పార్టీలు చేస్తోన్న విమర్శలను డోంట్ కేర్ అంటున్నారు.
బీజేపీలో ఆధిపత్యపోరుకు ఇప్పటినుంచే చెక్!
గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలైనా ఆ తర్వాత DK అరుణతో కలిసి బీజేపీలో చేరారు డోకూరు పవన్ కుమార్‌రెడ్డి. ఆయన కొంతకాలంగా సైలెంట్నే నియోజకవర్గంలో, పార్టీలో తన పట్టు సడలకుండా జాగ్రత్త పడుతున్నారట. ఇదే సమయంలో మరో యువనేత బీజేపీలో చేరేందుకు ప్రయత్నించి హడావిడి చేయడం బీజేపీలో చర్చకు దారితీసింది. సదరు యువనేత బండిసంజయ్‌తో టచ్‌లోకి కూడా వెళ్లారట. ఇంకా బీజేపీలో చేరకుండానే తానే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థినని ప్రచారం మొదలుపెట్టారట. ఈ సంగతి తెలుసుకున్న పవన్ కుమార్‌రెడ్డి అలర్ట్ అయినట్టు సమాచారం. బీజేపీలో చేరేందుకు అనుచరులతో కలిసి హైదరాబాద్ బయలుదేరిన సదరు యువనేతను మధ్యలోనే అడ్డుకున్నారట. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీ నేతలు మరింత చురుగ్గా పనిచేయడమే ఇక్కడ హాట్ టాపిక్‌గా మారింది.
కాంగ్రెస్‌లోనూ టికెట్ కోసం మొదలైన పోటీ!
బీజేపీలో చేరబోయిన యువనేతను కారు ఎక్కించేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారట. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ డ్రామా జిల్లా రాజకీయాలను వేడెక్కించింది. మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఎదుట పక్షానికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని చూస్తున్నారు గులాబీ నేతలు. ఇదే సమయంలో దేవరకద్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ ఎవరన్నది కూడా ఆసక్తిగా మారుతోంది. ఇప్పుడు ఇంఛార్జ్‌గా ఉన్నవారికే వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందని లెక్కలు వేసుకుంటూ మండలాల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పట్లో అసెంబ్లీ ఎన్నికలు లేకపోయినా.. ఇలా ముడు ప్రధాన పార్టీలు హడావిడి చేయడం... చేరికలకు ప్రాధాన్యం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాకపోతే టికెట్ ఆశిస్తోన్న వారికి మాత్రం ఇప్పటి నుంచే చేతి చమురు వదిలిపోతోందట. రానున్న రోజుల్లో ఇంకెన్ని మార్పులు చూడాలో అని చెవులు కొరుక్కుంటున్నారు స్థానికులు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)